Telugu Global
Andhra Pradesh

అప్పుడు మాటిచ్చా.. ఇప్పుడు నెరవేర్చా

గత ప్రభుత్వ హయాంలో 3076మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 76 లక్షల రూపాయలు మాత్రమే పెన్షన్ గా ఇచ్చేవారని గుర్తు చేశారు సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక 13,143మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. వారందరికీ ప్రతి నెలా రూ. 12.54 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.

అప్పుడు మాటిచ్చా.. ఇప్పుడు నెరవేర్చా
X

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను ఉద్ధానం ప్రజలకు మాటిచ్చానని, ఆ మాట ప్రకారం ఇప్పుడు కిడ్నీ బాధితులకోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టించానని చెప్పారు సీఎం జగన్. తన మాట నిలబెట్టుకున్నానని వివరించారు. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని 700 కోట్ల రూపాయల వ్యయంతో వైఎస్సార్ సుజలధార పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. వాటిని జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు జగన్.

వచ్చే ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు సీఎం జగన్. రాష్ట్రానికే కాదు, దేశానికే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అత్యాధునిక సౌకర్యాలు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో ఉన్నాయని చెప్పారు. 375మంది సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారని వివరించారు. త్వరితగతిన ప్రాథమిక దశలోనే కిడ్నీ వ్యాధుల్ని గుర్తించేందుకు 7 మండలాల్లో స్క్రీనింగ్ సెంటర్లు ఉన్నాయని, దీని ద్వారా మెరుగైన వైద్యం అందుతుందన్నారు సీఎం జగన్. కిడ్నీ వ్యాధులకు సంబంధించిన మందుల్ని ఇక్కడ ఉన్న అన్ని పి.హెచ్.సి. లలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో 3076మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని, వారందరికీ కలిపి 76 లక్షల రూపాయలు మాత్రమే పెన్షన్ గా ఇచ్చేవారని గుర్తు చేశారు సీఎం జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక 13,143మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. వారందరికీ ప్రతి నెలా రూ. 12.54 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. అసలు ఉద్ధానంలోనే కిడ్నీ సమస్యలు ఎందుకు ఉన్నాయనే విషయంపై కూడా పరిశోధనలు చేపట్టామని, అంతర్జాతీయ సంస్థలతో కలసి పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయని చెప్పారు జగన్. మనసు నిండా ప్రేమతో, మనసు నిండా అభిమానంతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తున్నాడని అన్నారు.

First Published:  14 Dec 2023 1:31 PM IST
Next Story