దేశం మొత్తం మనల్నే కాపీ కొడుతుంది చూడండి..
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశంలోనే అత్యుత్తమమైనది అని అన్నారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాలు కాపీకొడతాయని చెప్పారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది అద్భుతమైన పథకం అని అన్నారు సీఎం జగన్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని కావూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న జగన్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభించారు. ప్రతి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం కావడంతోనే ఈ కార్యక్రమం అమలులోకి తెచ్చామన్నారు. ఏ పేదవాడు సరైన వైద్యం లేక ఇబ్బంది పడకూడదన్నారు. ముందస్తుగా చిన్న చిన్న ఇబ్బందుల్ని పసిగడితే అవి ముదరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని, అందుకే ఫ్యామిలీ డాక్టర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.
దేశానికే ఆదర్శం..
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశంలోనే అత్యుత్తమమైనది అని అన్నారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాలు కాపీకొడతాయని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా సాధారణ వైద్య సేవలతోపాటు ఇతర సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వారికి కేటాయించిన డాక్టర్ ని సంప్రదించవచ్చని, ఆయనకు ఫోన్ చేసి మాట్లాడవచ్చని చెప్పారు. నెలకు కనీసం రెండుసార్లు ఫ్యామిలీ డాక్టర్ గ్రామానికి వచ్చి అందరికీ పరీక్షలు చేస్తారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తాను గర్వపడుతున్నానని అన్నారు జగన్.
ఆరోగ్యశ్రీ ఆయన చలవే..
ఆరోగ్యశ్రీ పేరు వినగానే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పేరు అందరికీ గుర్తొస్తుందని చెప్పారు సీఎం జగన్. పేదవాడి ప్రాణాలు గాలిలో దీపం కాకుండా చూసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. వైద్య రంగంలో 48,639 ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేశామని, వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గతానికి ఇప్పటికి తేడా చూడండని ప్రజల్ని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే ప్రతి గడపలో ఆరోగ్య విప్లవం, చదువుల విప్లవం, సంపాదన విప్లవం కనపడుతున్నాయని చెప్పారు. నవరత్నాల పాలనకు ఇదే నిదర్శనం అని అన్నారు జగన్.