ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం మాది..
బాబు దృష్టిలో కొందరు మంచివారు, మిగిలిన వారంతా లంచగొండులని అన్నారు. ఉద్యోగులను నిందించే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారన్నారు. బాబు మంచి చేయగలడా అని ఉద్యోగులు ఆలోచించాలని పిలుపునిచ్చారు సీఎం జగన్.
ఏపీలో ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని చెప్పారు సీఎం జగన్. అందుకే ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చామని చెప్పారు. జీపీఎస్ పెన్షన్ స్కీమ్ పై రెండు రోజుల్లో ఆర్డినెన్స్ వస్తుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తపన ఉన్న వ్యక్తిని తాను అని గుర్తు చేశారు. జీపీఎస్ పెన్షన్ స్కీమ్ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీఎన్జీవో అసోసియేషన్ 21వ రాష్ట్ర మహా సభలకు హాజరైన సీఎం జగన్, తమ ప్రభుత్వం ఉద్యోగులకోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పెండింగ్ లో ఉన్న డీఏలలో ఒకటి దసరా కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు జగన్.
జీతాలు పెంచింది మేమే..
గత ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు ఉద్యోగులను మభ్యపెట్టిందని చెప్పారు సీఎం జగన్. అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు పెంచింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారాయన. ఉద్యోగుల పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. 53 వేల మందిని హెల్త్ సెక్టార్ లో నియమించామన్నారు. ఉద్యోగుల ఇబ్బందుల గురించి ఎప్పుడూ సానుకూలంగానే స్పందించామన్నారు జగన్. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇచ్చిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. ప్రతీ చోటా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టామని, నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలిచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగాల మీద మమకారం ఉన్న ప్రభుత్వం తమదేనని చెప్పారు. నాడు-నేడుతో ప్రభుత్వ బడులను కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా రూపొందించామన్నారు జగన్. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం విస్తరించిందని వివరించారు. కారుణ్య నియామకాల్లో పారదర్శకత పాటించామని, 10వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు జగన్.
చంద్రబాబు దృష్టిలో ఉద్యోగులంటే..?
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు సీఎం జగన్. ఉద్యోగుల గురించి బాబుకు ఎంతో దారుణమైన అభిప్రాయాలున్నాయన్నారు. ఉద్యోగుల్లో చంద్రబాబు ఏ వర్గాన్నీ పట్టించుకోలేదని చెప్పారు. బాబు దృష్టిలో కొందరు మంచివారు, మిగిలిన వారంతా లంచగొండులని అన్నారు. ఉద్యోగులను నిందించే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారన్నారు. బాబు మంచి చేయగలడా అని ఉద్యోగులు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యవస్థలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, ఆయన హయాంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులను పట్టించుకోలేదని చెప్పారు జగన్.