మామ, అల్లుడిని లైట్ తీసుకున్న జగన్..
బాలకృష్ణ, లోకేష్ విషయంలో వారిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు జగన్.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమధ్య హిందూపురం వెళ్లారు, ఈరోజు మంగళగిరిలో ప్రచారం నిర్వహించారు. కానీ ఈ రెండు ప్రచారాల్లో ఎక్కడా ఆయన స్థానిక టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రస్తావించలేదు. హిందూపురంలో బాలయ్య పేరెత్తకుండానే ప్రచారం ముగించారు జగన్, మంగళగిరిలో లోకేష్ పేరు ప్రస్తావించకుండానే ప్రసంగం పూర్తి చేశారు. మామా, అల్లుడిని పూర్తిగా లైట్ తీసుకున్న జగన్, కేవలం చంద్రబాబుపైనే ఫోకస్ ఉంచారు.
ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థుల్ని పేరు పేరునా పరిచయం చేస్తూ వారి గుణగణాలను చెబుతున్న జగన్, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని మాత్రం హైలైట్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై కామెంట్లు చేయడంలేదు. సందర్భాన్ని బట్టి వారిని విమర్శిస్తున్నారు. బాలకృష్ణ, లోకేష్ విషయంలో వారిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారు జగన్.
గతంలో హిందూపురంలో బాలయ్య పేరు ప్రస్తావించలేదంటే ఓకే, ఈరోజు మంగళగిరి సభలో కనీసం లోకేష్ పేరు కూడా చెప్పలేదు సీఎం జగన్. కేవలం వైసీపీ అభ్యర్థిని బీసీ బిడ్డగా పరిచయం చేసి, ఆమెను గెలిపించాలని కోరారు. తన ప్రసంగంలో లోకేష్ పేరు చెప్పి అనవసరంగా ఆయన్ని హైలైట్ చేయాలనుకోలేదు జగన్. అందుకే పూర్తిగా లైట్ తీసుకున్నారు. మంగళగిరిలో జగన్ సభ చూసి టీడీపీలో వణుకు పుట్టిందని అంటున్నారు. మండుటెండలో జగన్ కోసం మంగళగిరివాసులు తరలివచ్చారు. వైసీపీ ప్రచారపర్వాన్ని విజయవంతం చేశారు. ఇన్నాళ్లూ అక్కడ గెలుపు తనదేనంటూ బీరాలు పలుకుతున్న లోకేష్ కి జగన్ ఎంట్రీతో ఆ ధైర్యం సన్నగిల్లిందనే చెప్పాలి.