భీమవరంలో పవన్ కి పని చెప్పిన జగన్..
దుష్టచతుష్టయం అంటూ అందర్నీ ఒకే గాటన కట్టేస్తూ పవన్ కల్యాణ్ కోసం మాత్రం కాస్త ఎక్కువ సమయం కేటాయించారు సీఎం జగన్.
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలన్నిటికీ ఒకేసారి సమాధానం చెప్పారు సీఎం జగన్. కురుపాంలో అమ్మఒడి బహిరంగ సభలో జనసేనానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో కూడా పవన్ కల్యాణ్ పై జగన్ చాలాసార్లు విమర్శలు చేశారు కానీ, ఈసారి డోస్ మరింత పెరిగింది. వారాహిలో చేస్తున్న కామెంట్లన్నిటికీ ఒకేసారి కౌంటర్ పడింది.
పవన్ గురించి ని జగన్ ఏమన్నారంటే..?
దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, నిలకడలేని మనిషి..
అదొక లారీ, దాని పేరు వారాహి..
చెప్పిచ్చుకు కొడతా, తాట తీస్తా, గుడ్డలూడదీసి కొడతా.. ఇవా మాటలు, ఆ నోటికి అదుపు లేదా..?
వారిలా మనం పూనకం వచ్చినట్టు ఊగుతూ మాట్లాడలేం
వారిలా రౌడీల్లా మనం మీసం మెలేయలేం, తొడలు కొట్టలేం, బూతులు తిట్టలేం
వారిలాగా నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకోసారి భార్యల్ని మార్చలేం.
పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డుపైకి తీసుకురాలేం.
వీటన్నిటికీ వారికే పేటెంట్ ఉంది.
ఇలా సాగింది జగన్ ప్రసంగం.
దుష్టచతుష్టయం అంటూ అందర్నీ ఒకే గాటన కట్టేస్తూ పవన్ కల్యాణ్ కోసం మాత్రం కాస్త ఎక్కువ సమయం కేటాయించారు సీఎం జగన్. సమాజాన్ని చీల్చేందుకే వారాహి యాత్ర చేస్తున్నారని చెప్పారు. పవన్ పెళ్లిళ్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ విమర్శలన్నిటికీ రెండురోజుల తర్వాత పవన్ భీమవరం సభలో బదులు చెప్పే అవకాశాలున్నాయి. విమర్శల ఘాటు కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి.. అప్పటి వరకూ పవన్ ఆగుతారా లేక మధ్యలోనే ప్రెస్ మీట్ పెడతారా అనేది తేలాల్సి ఉంది.
పునాదులు ముఖ్యం..
మన పునాదులు పేదల పట్ల ప్రేమలోనుంచి పుట్టాయి, రైతుల మమకారం నుంచి పుట్టాయి, అవ్వాతాతల, అక్క చెల్లెమ్మల బాధ్యతనుంచి పుట్టాయని అన్నారు సీఎం జగన్. వారి పునాదులు మోసం నుంచి పుట్టాయని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. నాలుగేళ్లుగా తాను బటన్ నొక్కుతున్నానని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అవుతోందని చెప్పారు.
సమాజంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్దది చేసి చూపెడుతున్నారని, అన్నిటికీ మనమే కారణం అంటూ నిందలేస్తున్నారని ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియాపై మండిపడ్డారు. ఏపీలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే అని చెప్పారు జగన్. దళిత చెల్లెమ్మ హోం మంత్రిగా పనిచేస్తున్నారని అన్నారు జగన్.