పవన్ పై మళ్లీ ఘాటు వ్యాఖ్యలు చేసిన జగన్
"పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి, పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేసిన దత్తపుత్రా..! ఒకసారి చేస్తే అది పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే దాన్ని అలవాటు అంటారు." అని కౌంటర్ ఇచ్చారు జగన్.
పవన్ కల్యాణ్, ఆయన వివాహాలపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు దత్తపుత్రుడు భార్యలను మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అదే అలవాటుతో ఇప్పుడు నియోజకవర్గాలను సైతం అలవోకగా మారుస్తున్నారని సెటైర్లు పేల్చారు. "పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి, పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేసిన దత్తపుత్రా..! ఒకసారి చేస్తే అది పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే దాన్ని అలవాటు అంటారు." అని కౌంటర్ ఇచ్చారు. దత్తపుత్రా..! ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడటం తప్పు కాదా? అని ప్రశ్నించారు.
పవన్ కు బీపీ..
ఇదేం అన్యాయం అని దత్తపుత్రుడిని అడిగితే ఆయనకు కూడా ఈ మధ్య బీపీ వస్తోందని అన్నారు జగన్. ఊగిపోతూ మాట్లాడుతున్నారని, ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనతోపాటు చంద్రబాబుకి, చంద్రబాబు వదినకు కూడా కోపం వస్తోందన్నారు జగన్.
సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు జగన్. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా ఆగిపోతాయని అన్నారు. వైసీపీకి ఓటు వేస్తేనే మంచి కొనసాగుతుందన్నారు. విపక్షాలన్నీ కలసి తనపై బాణాలు ఎక్కుపెట్టాయని, వారి బాణాలు తగిలేది జగన్ కా..? లేక సంక్షేమ పథకాలకా..? అని ప్రశ్నించారు. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా..? దుష్టచతుష్టయ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా..? అంటూ భీమవరం సభలో తన ప్రసంగాన్ని ముగించారు జగన్.