Telugu Global
Andhra Pradesh

నేను పిల్ల బచ్చానా..? మరి నువ్వేంటి..?

"రాజకీయాల్లో నేను బచ్చా అయితే, నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నిన్ను ఏమనాలి చంద్రబాబూ..?" అని సూటిగా ప్రశ్నించారు జగన్.

నేను పిల్ల బచ్చానా..? మరి నువ్వేంటి..?
X

అనకాపల్లి జిల్లా నరసింగపల్లి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం విమర్శలే కాదు, చంద్రబాబు సైతం డిఫెన్స్ లో పడిపోయేలా సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. తనను బచ్చా అంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని.. "రాజకీయాల్లో నేను బచ్చా అయితే, నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నిన్ను ఏమనాలి చంద్రబాబూ..?" అని సూటిగా ప్రశ్నించారు జగన్. అనకాపల్లి జిల్లా నరసింగపల్లి వద్ద జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబు మాటలు చూస్తే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు గుర్తుకు వస్తున్నాడని, హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు, రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు గుర్తొస్తున్నారని చెప్పారు జగన్. వారందరికీ ఏమైందో మనం చూశామని అన్నారు. పేదలకు మంచి చేసి ఉంటే బచ్చాను చూసి భయపడి 10 మందిని ఎందుకు పోగేసుకుంటున్నావు? అని సూటిగా ప్రశ్నించారు. కుట్రలు, మోసాలు, అబద్ధాలతో బాణాలు, రాళ్లు పట్టుకుని వారంతా తన చుట్టూ మోహరించి ఉన్నారన్నారు. దేవుడు, జనమే జగన్ కు తోడుగా ఉన్నారని తెలిపారు. ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కోవడం కష్టమై నక్కలు ఎగబడుతున్నాయని అన్నారు. తాను బచ్చాను అయితే తన హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం.. 14ఏళ్ల కాలంలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారన్నారు జగన్.

ప్రతి ఇంటికి మంచి చేసిన మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసిన వారి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు జగన్. సంక్షేమ ప్రభుత్వాన్ని ఓడించాలనే మోసగాళ్లతో, పేదలను గెలిపించాలనే మనం చేస్తున్న ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సిద్ధం సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయన్నారు జగన్. ప్రజలకు మంచి చేసి తాను ఒక్కడినే ఎన్నికలకు వస్తుంటే 75 ఏళ్ల వయసులో పది మందిని పోగేసుకుని చద్రబాబు వస్తున్నారని విమర్శించారు. ఒకే ఒక్కడిని ఎదుర్కొనేందుకు నక్కలన్నీ కలిసి వస్తున్నాయన్నారు జగన్.

First Published:  20 April 2024 7:24 PM IST
Next Story