Telugu Global
Andhra Pradesh

2 రోజుల్లో 31మంది మృతి.. బాబుని హంతకుడు అందామా..?

చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారని, పెన్షన్, రేషన్‌కార్డు, సర్టిఫికెట్, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు జగన్.

2 రోజుల్లో 31మంది మృతి.. బాబుని హంతకుడు అందామా..?
X

ఏపీలో పెన్షన్ల వ్యవహారం ఇంకా పొలిటికల్ హాట్ టాపిక్ గానే ఉంది. పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇవ్వలేకపోవడం వల్ల.. వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాల చుట్టూ తిరిగేందుకు అవస్థలు పడుతున్నారు. పైగా రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన ఎండలు వారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో బుధ, గురువారాల్లో మొత్తం 31మంది అవ్వాతాతలు చనిపోయారని తెలుస్తోంది. ఆ 31మందిని చంపిన చంద్రబాబు హంతకుడు కాదా అని ప్రశ్నించారు సీఎం జగన్. పోనీ అంతకంటే దారుణమైన పదం ఏదైనా ఉందా అని అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సభలో ప్రసంగించిన జగన్, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.


చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారని, పెన్షన్, రేషన్‌కార్డు, సర్టిఫికెట్, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు జగన్. వాలంటీర్‌ వ్యవస్థ వల్ల ఆ కష్టాలు లేకుండా చేశామని, అందుకే వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావని, ప్రజల తలరాతలు మార్చేవని చెప్పారు జగన్. రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలివి అని అన్నారు. "జగన్‌ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం.. పెత్తందారీ భావ­జాలానికి, మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది." అని అన్నారు జగన్.

58 నెలల వైసీపీ పాలనలో ఇంటింటికీ మంచి చేశామని చెప్పారు సీఎం జగన్. జగన్ చేయలేని మంచిని బాబు జేజమ్మ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. తాను అబద్ధాలు చెప్పనని, మోసం చెయ్యనని, కార్యకర్తలంతా కాలర్ ఎగరేసి మా లీడర్ జగన్ అని చెప్పుకునేలా పనిచేస్తున్నానని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తు రాదని, వారి హయాంలో జరిగినవన్నీ స్కాములేనని అన్నారు జగన్. 650 హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు ఓవైపు.. రూ 2.70 లక్షల కోట్లు.. అందులో 75 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి లబ్ధి చేకూర్చిన మీ బిడ్డ జగన్ మరోవైపు ఉన్నారని.. ప్రజలు ఎవరిపక్షాన ఉండాలో నిర్ణయించుకోవాలని సూచించారు.

First Published:  5 April 2024 6:57 AM IST
Next Story