నిన్న ఎమ్మెల్యేలకు తలంటు.. నేడు కలెక్టర్లకు క్లాస్..
సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ ఆధారంగా జిల్లా కలెక్టర్లకు మార్కులు ఇస్తున్నట్టు చెప్పారు సీఎం జగన్. SDG అనేది కలెక్టర్ల పనితీరుకు ప్రామాణికమని అన్నారు.
గడప గడపకు తిరగని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోనంటూ కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్. మరుసటి రోజే.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ఆయన.. కలెక్టర్ల పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) ఆధారంగా జిల్లా కలెక్టర్లకు మార్కులు ఇస్తున్నట్టు చెప్పారు. SDG అనేది కలెక్టర్ల పనితీరుకు ప్రామాణికమని అన్నారు.
గడప గడపకు నిధులపై సమీక్ష..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లే ఎమ్మెల్యేలు స్థానిక సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ హామీల అమలుకోసం కలెక్టర్లు ముందుకు కదలాల్సి ఉంటుంది. నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున, ప్రతి సచివాలయానికి 20లక్షల నిధుల్ని కేటాయిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారు, ఏ మేరకు ఎమ్మెల్యేల హామీలు అమలవుతున్నాయనే విషయంపై జగన్ సమీక్ష నిర్వహించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఏ సచివాలయ పరిధిలో పూర్తవుతుందో.. ఆ ప్రాంతంలో నెల రోజుల్లోగా ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబరు 25న ఈ–క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు.
జగనన్న కాలనీల సంగతేంటి..?
జగనన్న కాలనీల్లో స్థలాలు కేటాయించారు కానీ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అటు టిడ్కో ఇళ్ల వ్యవహారం కూడా అలాగే తయారైంది. మౌలిక వసతులు కల్పించి గృహప్రవేశాలు చేయిస్తున్నా అది ఇంకా స్పీడందుకోలేదు. దీనిపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. డిసెంబర్ 21వ తేదీ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షల ఇళ్లు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని చెప్పారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ -3 కింద డిసెంబర్ లో ఇళ్లు మంజూరు చేయాలన్నారు జగన్. కలెక్టర్ల పనితీరుని కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేస్తుంటామని స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (SDG) అందుకోవాలని సూచించారు.