Telugu Global
Andhra Pradesh

వైసీపీలో ఉత్కంఠ రేపుతున్న 'నాలుగు' జిల్లాలు

ఏ రూపంలో ఎన్ని విధాలుగా నివేదికలు తెప్పించుకుంటున్నా నాలుగు జిల్లాల మీదే జగన్ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

వైసీపీలో ఉత్కంఠ రేపుతున్న నాలుగు జిల్లాలు
X

అధికారపార్టీ నేతల మధ్య ఇప్పుడు నాలుగు జిల్లాలపైనే బాగా చర్చ జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ జగన్మోహన్ రెడ్డి అనేక మార్గాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఐప్యాక్ టీమ్, పార్టీ నేతలు, ఇంటెలిజెన్స్ మార్గాల్లో ఎప్పటికిప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు అందుతున్నాయి. ఇదే సమయంలో తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణపైన కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు.

ఏ రూపంలో ఎన్ని విధాలుగా నివేదికలు తెప్పించుకుంటున్నా నాలుగు జిల్లాల మీదే జగన్ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దాంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ నాలుగు జిల్లాలపైనే పడింది. ఇంతకీ ఆ నాలుగు జిల్లాలు ఏవంటే పశ్చిమగోదావరి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం. పైజిల్లాల్లోని కొందరు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నట్లు జగన్ ఇప్పటికే అభిప్రాయానికి వచ్చారట. పై జిల్లాల్లో మాజీమంత్రుల పనితీరుపైన ఏమాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది.

పశ్చిమగోదావరిలో మాజీమంత్రి ఆళ్ల‌ నాని వ్యవహారం జగన్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. నెల్లూరులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గడప గడపకు కార్యక్రమంలో పెద్దగా పార్టిసిపేట్ చేయటంలేదని నివేదికలో తేలిందట. అలాగే మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తరచూ వివాదాల్లో ఉంటున్న విషయాన్ని కూడా జగన్ గమనిస్తున్నారట.

ఇక గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటంలేదట. ఎమ్మెల్యే శ్రీదేవి తరచూ వివాదాస్పదమవుతున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, మంత్రి విడదల రజని మధ్య వివాదాలు పార్టీ పరువు తీస్తున్నట్లు జగన్ దృష్టికి వచ్చిందట. చివరగా ప్రకాశం జిల్లాలో కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా గడప గడప కార్యక్రమంలో పెద్దగా పాల్గొనటంలేదని తేలింది. ఇదే సమయంలో చీరాలలో గొడవలు తలనొప్పిగా తయారైంది. మంత్రి సురేష్ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నా ఉండాల్సినంత యాక్టివ్ గా లేరని నివేదికలో వచ్చిందట. తనకందిన నివేదిక కారణంగా జగన్ పై నాలుగు జిల్లాలపైన టికెట్ల విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

First Published:  4 Dec 2022 4:52 AM GMT
Next Story