Telugu Global
Andhra Pradesh

జగన్‌ తొలి సంతకం దానిపైనే.. - తిరుపతి సభలో క్లారిటీ

జగన్‌ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 8వ రోజు తిరుపతి జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై పలు విమర్శలు గుప్పించారు.

జగన్‌ తొలి సంతకం దానిపైనే.. - తిరుపతి సభలో క్లారిటీ
X

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం జరిగిన తిరుపతి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్‌ 4 వరకు ఓపిక పట్టండి.. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది.. అంటూ స్పష్టం చేశారు. అంతేకాదు.. తాను మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే తొలి సంతకం గురించి క్లారిటీ ఇచ్చారు. వలంటీర్‌ వ్యవస్థ పైనే తొలి సంతకం చేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీని వలంటీర్ల ద్వారానే కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు.

జగన్‌ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 8వ రోజు తిరుపతి జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుపై పలు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు 2014లోనూ కూటమిగా ఏర్పడి పోటీ చేశాడని, స్వయంగా మ్యానిఫెస్టో కూడా రూపొందించి.. ముఖ్యమైన హామీలంటూ ఇంటింటికీ పంచాడని వివరించారు. టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడని చెప్పారు.

చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని జగన్‌ చెప్పారు. వలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదని ఆయన చెప్పారు. పొదుపు సంఘాలకు పూర్తి రుణమాఫీ అన్నాడని, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తా అన్నాడని, ఇంటింటికీ నిరుద్యోగ భృతి అన్నాడని, రైతులకు రుణమాఫీ అన్నాడని, 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడని, కనీసం సెంటు స్థలం అయినా ఇచ్చాడా? అని నిలదీశారు. ఇవేవీ చేయకుండా ప్రజలను మోసం చేశాడని ఆయన మండిపడ్డారు.

First Published:  5 April 2024 8:20 AM IST
Next Story