జగన్ డైరెక్టుగా రంగంలోకి దిగుతున్నారా..?
వివిధ జిల్లాల్లో పార్టీలోని అసంతృప్తులపై జగన్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంతో డ్యామేజి కంట్రోల్ ను మొదలు పెట్టబోతున్నారట.
అప్పుడెప్పుడో వచ్చిన జనతా గ్యారేజ్ అనే సినిమాలో తమ దగ్గరకు వచ్చిన జనాల సమస్యలకు హీరో పరిష్కారం చూపిస్తుంటాడు. అచ్చంగా అలాంటి పద్దతినే సోమవారం నుంచి జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టబోతున్నారు. కాకపోతే ఈ ప్రయత్నానికి మామూలు పబ్లిక్‌కు సంబంధంలేదు. పార్టీకి జరుగుతున్న డ్యామేజిని సరిదిద్దుకునేందుకు మాత్రమే ఉద్దేశించింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. పార్టీలో పెరిగిపోతున్న అసంతృప్తులను బుజ్జగించి విషయం తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలని జగన్ డిసైడ్ అయ్యారట.
వివిధ జిల్లాల్లో పార్టీలోని అసంతృప్తులపై జగన్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంతో డ్యామేజి కంట్రోల్ ను మొదలు పెట్టబోతున్నారట. తొందరలో ఎన్నికలు రాబోతున్న కారణంగా ఇప్పుడే పార్టీకి జరుగుతున్న డ్యామేజీని కంట్రోల్ చేయకపోతే ముందు ముందు మరింత సమస్యగా మారిపోతుందని జగన్ భావించారు. ఇందులో భాగంగానే నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని పిలిపించుకుని మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే.
ఇదేపద్దతిలో నందికొట్కూరు, హిందుపురం, ప్రత్తిపాడు, మైలవరం, పాయకరావుపేట, కర్నూలు, మడకశిర లాంటి మరికొన్ని నియోజకవర్గాల ఎంఎల్ఏలు, నేతలతో భేటీ కావాలని డిసైడ్ అయ్యారట. ఈ జాబితాలో తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదని నేతలంటున్నారు. ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డిని ఒకసారి పిలిపించుకుని మాట్లాడితే అన్నీ సమస్యలు పరిష్కారమవుతుందని రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సీఎంకు సూచించినట్లు సమాచారం.
ఆనం గనుక పార్టీ వీడితే ఆయన చేరబోయే పార్టీకి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుందో చెప్పలేకపోయినా ఆత్మకూరు, నెల్లూరు సిటి, రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల్లో వైసీపీకి డ్యామేజి జరుగుతుందని వేమిరెడ్డి చెప్పారట. జగన్ గనుక వేమిరెడ్డి సలహాతో కన్వీన్స్ అయితే అప్పుడు ఆనంను కూడా పిలిపించి మాట్లాడే అవకాశముందంటున్నారు. మొత్తానికి పార్టీలోని అసంతృప్తులను పిలిపించి మాట్లాడి డ్యామేజిని కంట్రోల్ చేయాలని జగన్ అనుకోవటం మంచిదే కదా.