Telugu Global
Andhra Pradesh

ములాఖత్ లో మిలాఖత్.. బాబు ఎపిసోడ్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్

ఎల్లో మీడియా నిజాలు చూపించదని, చంద్రబాబు అవినీతిపై మాట్లాడదని, అందరూ వాటాలుపంచుకుంటారని, అందుకే వారెవరూ నోరు మెదపట్లేదని అన్నారు జగన్.

ములాఖత్ లో మిలాఖత్.. బాబు ఎపిసోడ్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్
X

చంద్రబాబు అరెస్ట్, ఖైదు.. ఎపిసోడ్ పై ఇప్పటికే వైసీపీ నేతలంతా స్పందించారు. కానీ జగన్ స్పందన కోసమే అందరూ వెయిటింగ్. ఆ వెయిటింగ్ కి ఈరోజు తెరదించారు సీఎం. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, తదనంతర పరిణామాలు, జైలులో పొత్తు రాజకీయాలపై కూడా జగన్ సుదీర్ఘంగా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కాపునేస్తం నిధులు విడుదల చేసిన అనంతరం జగన్, ప్రతిపక్షాలకు చాకిరేవు పెట్టారు.



45 ఏళ్లుగా చంద్రబాబు దోపిడీనే రాజకీయంగా మార్చుకున్నారని మండిపడ్డారు సీఎం జగన్. గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని, సాక్ష్యాధారాలతో దొరికినా బుకాయించడం ఆయన నైజం అని చెప్పారు. ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానా దోచేశారన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి తెరతీశారని, సీమెన్స్ కంపెనీ కూడా తమకు సంబంధం లేదని చెప్పిందని గుర్తు చేశారు. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందని, ఒత్తిడి తీసుకొచ్చి అధికారులతో సంతకాలు పెట్టించి నిధులు దోచేశారని చెప్పారు జగన్. డొల్ల సూట్ కేసు కంపెనీలకు ఈ సొమ్మంతా మళ్లించినట్టు ఈడీ తేల్చిందని, సీఐడీ అరెస్ట్ చేసినా, ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారని విమర్శించారు. ఎల్లో మీడియా నిజాలు చూపించదని, చంద్రబాబు అవినీతిపై మాట్లాడదని, అందరూ వాటాలుపంచుకుంటారని, అందుకే వారెవరూ నోరు మెదపట్లేదని అన్నారు జగన్.

ములాఖత్ లో మిలాఖత్..

ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు.. ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకుంటాడు.. అంటూ పవన్ కల్యాణ్ పై కూడా పరోక్షంగా సెటైర్లు పేల్చారు సీఎం జగన్. 371 కోట్ల రూపాయల జనం సొమ్ము ఎటుపోయిందని ప్రశ్నించారు. చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకెవరిని అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు. అక్రమాలు, దోపిడీలు చేసిన బాబును రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒకటేనన్నారు జగన్. ప్రజలంతా ఈ విషయంపై ఆలోచన చేయాలన్నారు. మీ బిడ్డ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా అని చూసి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు జగన్.

First Published:  16 Sep 2023 7:32 AM GMT
Next Story