ప్రజలకు మంచి చేయని బాబు మూడుసార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యారంటే..
మూడవసారి 2014లో తనను గెలిపిస్తే ఇంద్రలోకం రేంజ్ లో రాజధానిని కడతానని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.
చంద్రబాబు ప్రజలకు మంచి చేసి ఎప్పుడూ ముఖ్యమంత్రి కాలేదని సీఎం జగన్ అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అవడానికి ఇతర కారణాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేసి ఎప్పుడూ చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదన్నారు. ఒకసారి తన మామ ఎన్టీఆర్ టీడీపీని అధికారంలోకి తీసుకువస్తే చంద్రబాబు ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అప్పట్లో ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలిపించలేదని ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా గెలిపించారని చెప్పారు.
ఇక రెండవసారి 2000 సంవత్సరంలో కార్గిల్ యుద్ధ పుణ్యాన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కార్గిల్ యుద్ధం వెనుక తన పాత్ర ఉందని, దేశాన్ని నడిపించగల సత్తా కూడా తనకు ఉందని చంద్రబాబు ప్రచారం చేయించుకొని ముఖ్యమంత్రి అయ్యారని జగన్ అన్నారు.
మూడవసారి 2014లో తనను గెలిపిస్తే ఇంద్రలోకం రేంజ్ లో రాజధానిని కడతానని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. ఆయన చూపించిన ఇంద్రలోకం ఎఫెక్ట్ 2019 ఎన్నికల్లో గూబగుయ్ అనేలా చేసిందని విమర్శించారు.
చంద్రబాబు హయాంలో పేదల అభివృద్ధి జరగలేదని, ఆయన కంటికి పేదలు కనిపించలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరిందని, లబ్ధి చేకూరిందని అనుకుంటునే తనకు ఓటు వేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ కోరారు.