ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్నది కాలనీలు కాదు.. ఊళ్లు - గుడివాడ సభలో సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. 178 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి ఇచ్చిన స్థలం విలువ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు కాదని, ఊళ్లని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గుడివాడలో శుక్రవారం నిర్వహించిన టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చామని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ఐదు లక్షల 52 వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. 178 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి ఇచ్చిన స్థలం విలువ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందని వివరించారు.
పూర్తయిన ప్రతీ ఇంటి కోసం అయిన ఖర్చు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇక నుంచి 16 వేలకు పైగా కుటుంబాలు ఈ టిడ్కో ఇళ్లలోనే ఉండబోతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 17 వేల కాలనీల నిర్మాణం జరుగుతోందని సీఎం జగన్ తెలిపారు. ఇదే గుడివాడలో పేదలకు టిడ్కో ఇళ్లపై హామీ ఇచ్చానని, ఇప్పుడు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోందని సీఎం చెప్పారు. 8,859 ఇళ్లకు అదనంగా జూలై 7దీన మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
ప్రజలకు మంచి చేసిన చరిత్రే బాబుకు లేదు...
చంద్రబాబుపై ఈ సందర్భంగా సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ప్రజలకు మంచి చేసిన చరిత్రే బాబుకు లేదని ఆయన విమర్శించారు. మరోసారి చాన్స్ ఇవ్వాలంటున్న బాబు.. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏం చేశాడని ప్రశ్నించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు తయారయ్యాడని వివరించారు. టిడ్కో ఇళ్ల కోసం చంద్రబాబు పేదలపై భారం వేశారని, నెలకు రూ.3 వేలు చొప్పున 20 ఏళ్లు కట్టాలని చెప్పారని, తమ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇల్లు అందిస్తోందని సీఎం జగన్ వివరించారు.