Telugu Global
Andhra Pradesh

రూటు మార్చిన జగన్..

గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఈ అంశం ప్రజల్లోకి నెగిటివ్ గా వెళ్లిందని సమాచారం.

రూటు మార్చిన జగన్..
X

ముఖ్యమంత్రి జగన్ సడన్‌గా త‌న రూటు మార్చారు. దెందులూరు ప్ర‌సంగంలో ప్రతిపక్షాలను ఒక్క మాట అనలేదు. పచ్చ మీడియానూ తిట్టలేదు. పవన్ కల్యాణ్ పై కూడా ఒక్క విమర్శ చేయలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహం సిద్ధం చేసుకున్నాడేమోనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసరా పంపిణీ పథకంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ ఏలూరు జిల్లాలోని దెందలూరులో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో ప్రతిపక్షాలపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. కేవలం తాము ఏమేం చేస్తున్నామో మాత్రమే చెప్పారు.

సహజంగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కే కార్య‌క్ర‌మంలో తొలుత సీఎం సదరు పథకానికి సంబంధించి మాట్లాడతారు. తమ ప్రభుత్వం ఆ పథకం కోసం ఎన్ని కోట్లు వెచ్చిస్తోంది. ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది. గత ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసింది..? తాము ఎన్ని నిధులు విడుదల చేశామో.. లెక్కలు చెబుతుంటారు. అనంతరం ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెడతారు.

తమపై కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తారని ఆరోపిస్తారు. వాళ్లను దుష్టచతుష్టయంగా పేర్కొంటూ విమర్శలు చేస్తారు. అయితే ఇవాళ అనుహ్యంగా దెందులూరు మీటింగ్ లో ముఖ్యమంత్రి విపక్షాలను ఒక్కమాట కూడా అనలేదు. కేవలం సంక్షేమ పథకాలను వివరిస్తూనే ఆయన ప్రసంగం సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కొంత చేదు ఫలితాలను చూసిన విషయం తెలిసిందే.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లను గెలుచుకోలేపోయింది. అనుహ్యంగా టీడీపీ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక భవిష్యత్ లో తమదే అధికారం అని టీడీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ .. తాజాగా విమర్శలు చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఈ అంశం ప్రజల్లోకి నెగిటివ్ గా వెళ్లిందని సమాచారం. దీంతోనే జగన్ విపక్షాలపై విమర్శల డోసును బాగా తగ్గించి.. కేవలం తమ ప్రభుత్వం ఏమేం చేసిందే మాత్రమే ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారట. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇదే విషయం చెప్పినట్టు సమాచారం. మరి భవిష్యత్ లో ఏపీ రాజకీయనేతలెవరూ తిట్టుకోకుండా కేవలం నిర్మాణాత్మకమైన ప్ర‌సంగాలే చేస్తారా..? ఈ విషయం కూడా నమ్మశక్యంగా లేదు కానీ.. ముఖ్యమంత్రి వ్యూహం మాత్రం అదే అంటున్నారు విశ్లేషకులు.

First Published:  25 March 2023 8:58 AM GMT
Next Story