జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..
5.03 గంటలకు టేకాఫ్ అయిన విమానం 5.26 గంటలకు అత్యవసరంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే ల్యాండ్ అయింది. అక్కడినుంచి సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి బయలుదేరిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని వెంటనే తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి తీసుకొచ్చి అత్యవసరంగా కిందకు దించారు. విమానం నుంచి జగన్ తోపాటు, మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి కూడా బయటకు వచ్చేశారు. సాంకేతిక లోపం తలెత్తిందన్న విషయం తెలియగానే వైసీపీ శ్రేణులు కంగారు పడ్డాయి. చివరకు జగన్ సహా మిగతావారంతా క్షేమంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే ల్యాండ్ అయ్యారనే విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
సమస్య ఏంటి..?
ఈరోజు వినుకొండలో చేదోడు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్, ఎంపీ మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి.. ప్రత్యేక విమానంలో బయలుదేరారు. సరిగ్గా 5.03 గంటలకు విమానం టేకాఫ్ అయింది. విమానం బయలుదేరిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమయ్యారు. విమానాన్ని ముందుకి తీసుకెళ్లడం కంటే.. సేఫ్ గా గన్నవరం తీసుకెళ్తేనే మేలు అనుకున్నారు. ఎయిర్ కంట్రోల్ రూమ్ కి సమాచారమిచ్చారు. వారి దగ్గరనుంచి పర్మిషన్ రాగానే వెంటనే విమానాన్ని వెనక్కు తిప్పారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 5.03 గంటలకు టేకాఫ్ అయిన విమానం 5.26 గంటలకు అత్యవసరంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే ల్యాండ్ అయింది. అక్కడినుంచి సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖ పట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగాల్సి ఉంది. మంగళవారం ఢిల్లీలో దీనికి సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. పలు దేశాల ప్రతినిధులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు. అదేరోజు రాత్రి జగన్ తిరిగి తాడేపల్లికి రావాల్సి ఉంది. ఇదీ ఆయన షెడ్యూల్. అనుకోకుండా ఇప్పుడు జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపంతో ఆయన విమానాశ్రయం నుంచి వెనుదిరిగారు. ఆయన ఢిల్లీ ప్రయాణం కోసం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.