Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనని చెప్పడం గొప్పతనమా..?

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను అని చెప్పిమరీ వారి ఓట్లు ఆశించడం అత్యాశే అవుతుంది. పార్టీకి మీరు అవసరం లేదు, కానీ పార్టీకి మీ ఓటు కావాలి అనడం ఎలాంటి లాజిక్కో వైసీపీ నేతలే చెప్పాలి.

ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనని చెప్పడం గొప్పతనమా..?
X

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేల తిరుగుబాటు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సంగతి పక్కనపెడితే.. మిగతా ఇద్దరి తిరుగుబాటు ఊహించనిది. దానికి అసలు కారణం వారికి ఎమ్మెల్యే టికెట్లు నిరాకరించడం. ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ ఉంది. ఈలోగా వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనని చెప్పేశారు సీఎం జగన్. బతిమిలాడినా, బామాలినా ససేమిరా అన్నారు. మీతో మాకింక పనిలేదన్నారు. అంత మాట అన్నాక వారు ఊరుకుంటారా.. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసి షాకిచ్చారు. ఇది చేజేతులారా జగన్ కొని తెచ్చుకున్న పరాభవమేనా..? లేక ఈ ఎపిసోడ్ లో విలువలు విశ్వసనీయత అనేవి ఉన్నాయా..?

వచ్చే ఎన్నికల్లో వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనని జగన్ తేల్చి చెప్పారు, అందుకే వారు తమ పార్టీకి ఓటు వేయలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో వారు డబ్బులకు అమ్ముడుపోయారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను అని చెప్పిన జగన్ జట్టులో వారు ఎందుకు ఉండాలి..? ఉన్నా ఉపయోగం ఏంటి..? టీడీపీ డబ్బులివ్వకపోయినా రివేంజ్ కోసం అయినా వారు ఆ పార్టీకే ఓటు వేస్తారు, వేశారు కూడా. ఇక్కడ విలువలు, విశ్వసనీయత అనే ప్రశ్నే లేదు కదా. మా పార్టీ టికెట్ పై గెలిచి, పక్కపార్టీకి ఓటు వేయడానికి సిగ్గులేదా అంటున్న వైసీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లు వేయించుకోవడంపై మాత్రం నోరు మెదపడంలేదు.

జగన్ చేసింది సాహసమా..? పొరపాటా..?

కావాలంటే ఆ ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పి జగన్ ఓట్లు వేయించుకుని ఉండొచ్చని, కానీ ఆయన మాటమీద నిలబడే మనిషి కాబట్టి టికెట్లు ఇవ్వనని కరాఖండిగా చెప్పారని, అందుకే తాము ఆ ఒక్క సీటు కోల్పోయామని అంటున్నారు వైసీపీ నేతలు. అసలు ఎన్నికలకు ఏడాది టైమ్ ఉండగా ఇప్పుడే టికెట్ల గోల ఎందుకు..? పోనీ జగన్ ధీమాగా టికెట్ ఇచ్చినవారంతా 2024లో గెలుస్తారనే నమ్మకం వైసీపీకి ఉందా..? 2019 ఎన్నికల్లో చివరి రోజుల్లో ఎన్ని జిమ్మిక్కులు జరగలేదు. టీడీపీ బీఫామ్ తెచ్చుకుని, ప్రచారం కూడా మొదలు పెట్టిన నెల్లూరు టీడీపీ ఎంపీ ఆభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, చివరి నిమిషంలో వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకోలేదా..? గెలుపు గుర్రాలు ఎప్పుడొచ్చినా కండువా కప్పడానికి నాయకులు రెడీగానే ఉంటారు. 2024లో ఇలాంటివి జరగవు అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు.

సస్పెన్షన్ విషయంలో పార్టీ అధిష్టానానికి పూర్తి స్వేచ్ఛ ఉంది, అయితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను అని చెప్పిమరీ వారి ఓట్లు ఆశించడం అత్యాశే అవుతుంది. పార్టీకి మీరు అవసరం లేదు, కానీ పార్టీకి మీ ఓటు కావాలి అనడం ఎలాంటి లాజిక్కో వైసీపీ నేతలే చెప్పాలి. ఎన్నికలకు ఏడాది ముందుగానే టికెట్ల విషయంలో ఇంత రచ్చ జరుగుతుంటే.. ఇక టైమ్ దగ్గరపడితే వైసీపీలో ఇంకెంతమందిని టార్గెట్ చేస్తారో వేచి చూడాలి. ఏపీలో టీడీపీ బలం ఒక్కసారిగా పెరిగిపోయిందని అనుకోలేం కానీ, వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలే టీడీపీకి అనుకోకుండా కలిసొస్తున్నాయి.

First Published:  25 March 2023 9:45 PM IST
Next Story