మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, గొడవలు, శవ రాజకీయాలు
రాష్ట్రంలో దొంగ ఓట్లు తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ని కలసి ఏమని ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు.
చంద్రబాబు రాజకీయమంతా మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, గొడవవలు, శవ రాజకీయాలేనని విమర్శించారు సీఎం జగన్. రాష్ట్రంలో గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి లో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసిన ఆయన.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
లోకేష్ పై నమ్మకం లేకే..
సొంత కొడుకు లోకేష్ పై నమ్మకం లేక దత్త పుత్రుడు పవన్ కి ప్యాకేజ్ ఇచ్చారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు జగన్. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని, పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచాడని అన్నారు. చంద్రబాబు ప్రతి అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపడ్డారు. పుంగనూరులో అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడి చేశారన్నారు. చంద్రబాబులాగా దారుణమైన అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరని అన్నారు.
దొంగఓట్లు తొలగిస్తే తప్పేంటి..?
రాష్ట్రంలో దొంగ ఓట్లు తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ని కలసి ఏమని ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తనమీద హత్యాయత్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారని కేంద్రానికి చంద్రబాబు తప్పుడు ఫిర్యాదు చేయబోతున్నారని అన్నారు. వారే దొంగ ఓట్లను ఎక్కించి, తమపై ఫిర్యాదు చేస్తున్నారని ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తి, మోసం చేయగలిగిన వ్యక్తి, కుట్రలకు పాల్పడే వ్యక్తి ఎవరూ ఉండరన్నారు జగన్.
ఏపీ రోల్ మోడల్..
నేడు దేశానికే రోల్ మోడల్ గా ఏపీలో పాలన జరుగుతోందన్నారు సీఎం జగన్. స్కూళ్లు, కాలేజీలు మారుతున్నాయని, ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు పనులు, ఐఎఫ్ పీ ప్యానెల్స్ వస్తున్నాయన్నారు. కరికులమ్ లో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన వస్తోందని చెప్పారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న మనపై ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని, వారి మాటలు ఎవరూ నమ్మొద్దని చెప్పారు జగన్.
♦