రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో జగన్ భేటీ
ఇటీవల దారుణ హత్యకు గురైన హిందూపురం వైసీపీ మాజీ ఇన్‌చార్జ్ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని అభయం ఇచ్చారు.
ఇటీవల దారుణ హత్యకు గురైన హిందూపురం వైసీపీ మాజీ ఇన్‌చార్జ్ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ ఓదార్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు కలిశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారిని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. చాలాసేపు సీఎం వారితో మాట్లాడారు.
రామకృష్ణారెడ్డి పార్టీకి చేసిన సేవలను సీఎం జగన్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తొలి నుంచి రామకృష్ణారెడ్డి తనతో ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. తప్పకుండా న్యాయం చేస్తానని కుటుంబ సభ్యులకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఏ అవసరం ఉన్నా పార్టీ అండగా ఉంటుందని అభయం ఇచ్చారు. హంతకులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఏదైనా కీలక నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు చర్చ నడుస్తోంది. సీఎం జగన్‌ను కలిసినవారిలో రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ, భార్య జ్యోత్స్న, కుమారుడు, సోదరి, బావ తదితరులున్నారు.