బాబుది బోగస్ రిపోర్ట్.. నాది ప్రోగ్రెస్ రిపోర్ట్
చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, మరో ఐదేళ్లు మీ రక్తం తాగుతుందని హెచ్చరించారు జగన్.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అని, తనది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పారు సీఎం జగన్. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒకటయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. బోగస్ హామీలతో ప్రజల్ని మోసం చేశారని, మరోసారి అలాంటి హామీలతోనే ఆయన సిద్ధం అయ్యారని, అందుకే ఆయనది బోగస్ రిపోర్ట్ అని చెప్పారు. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలని, ఆ నమ్మకం చంద్రబాబుపై లేదని, ఇకపై రాదని అన్నారు. 58 నెలల తన పాలనలో.. చెప్పాడంటే, చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు జగన్.
జగన్‌కు ఓటు వేస్తేనే పథకాల కొనసాగింపు ఉంటుందని, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు అని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, మరో ఐదేళ్లు మీ రక్తం తాగుతుందని హెచ్చరించారు. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ అబద్ధమేనన్నారు జగన్. జాబు రావాలంటే బాబు రావాలంటూ ఊదరగొట్టారని, చివరకు యువతను మోసం చేశారని, రైతు రుణమాఫీపై తొలిసంతకం అన్నారని, చివరకు బ్యాంక్ లలో పెట్టిన బంగారం వేలం వేయించారని విమర్శించారు. వ్యవసాయం దండగ అని చెప్పింది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు అరేసుకోవాలి చెప్పింది చంద్రబాబు కాదా అని అన్నారు జగన్.
రైతులకు అండగా ఉంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు జగన్. పగటి పూట రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ సచివాలయాలు కట్టించామని, ప్రతి గ్రామానికి ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీ.. నాడు-నేడు తో బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చామనన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు వచ్చాయని, కొత్తగా నాలుగు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లు వస్తున్నాయని తెలిపారు జగన్.