వసంతకు, ఉమాకు ఒక్క దెబ్బతో చెక్ పెట్టిన జగన్
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కొన్నాళ్లుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. టీడీపీలోకి వెళ్లే ఉద్దేశంతోనే ఆయన పార్టీపై విమర్శలు చేస్తున్నారని జగన్ గుర్తించారు.
ముఖ్యమంత్రి జగన్ వైసీపీ సమన్వయకర్తల ఎంపికలో చాకచాక్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన చేస్తున్న ఎంపికలు ప్రత్యర్థి పార్టీలకే కాదు పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న కొద్ది మంది నాయకులకు కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా నిన్న ఆరో జాబితాలో మైలవరం వైసీపీ సమన్వయకర్తగా తిరుపతిరావు యాదవ్‌ను ప్రకటించడం ద్వారా అటు ప్రతిపక్ష టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లకు ఒకేసారి చెక్‌పెట్టారు.
వసంత డొంక తిరుగుడు రాజకీయాలకు చెక్
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కొన్నాళ్లుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. టీడీపీలోకి వెళ్లే ఉద్దేశంతోనే ఆయన పార్టీపై విమర్శలు చేస్తున్నారని జగన్ గుర్తించారు. మరోవైపు ఏలూరులో జరగనున్న `సిద్ధం` సభకు పార్టీ శ్రేణులను తీసుకురావడానికి కూడా వసంత నిరాసక్తత ప్రదర్శించారని తెలియడంతో జగన్ ఆయన్ను పక్కనపెట్టాలని ఫిక్సయిపోయారు. అందుకే ప్రత్యామ్నాయంగా బీసీల నుంచి సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను తెరపైకి తెచ్చారు. తద్వారా వసంతకు వైసీపీలో టికెట్ లేదని తేల్చేశారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ టీడీపీ టికెట్ తెచ్చుకున్నా అక్కడ ఉమా వర్గం ఆయనకు సహకరించడం కష్టమే.
అటు ఉమాకూ దెబ్బకొట్టినట్టే
వైసీపీలో టికెట్ దక్కదని తేలడంతో.. టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్న వసంత అందుకు పూర్తిస్థాయిలో సిద్ధమైపోతారని జగన్ భావిస్తున్నారు. అదే జరిగితే చంద్రబాబు వసంతకే టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. దీనిపై వసంతకు, టీడీపీ నేతలకు మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వసంతకు టికెటిస్తే ఇక్కడ సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు టికెట్ లేనట్లే. మైలవరంలో తప్ప ఇంకెక్కడా ఉమా చెల్లరని చంద్రబాబుకు కూడా తెలుసు. తనపై ప్రెస్‌మీట్లలో నోటికొచ్చినట్లు మాట్లాడే ఉమాకు చెక్ పెట్టడానికి ఇంతకు మించి అవకాశం జగన్‌కు మాత్రం ఏముంటుంది?