Telugu Global
Andhra Pradesh

ఆ ధైర్యం బాబుకి ఉందా..? ముస్లిం రిజర్వేషన్లపై జగన్ ఛాలెంజ్

59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చామని వివరించారు సీఎం జగన్.

ఆ ధైర్యం బాబుకి ఉందా..? ముస్లిం రిజర్వేషన్లపై జగన్ ఛాలెంజ్
X

మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటానని మరోసారి భరోసా ఇచ్చారు సీఎం జగన్. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన చంద్రబాబుకి ఓ ఛాలెంజ్ విసిరారు. 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని, ఆ విషయంలో బీజేపీని ఎదిరిస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని, ఓ వైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరో వైపు మైనార్టీలపై దొంగప్రేమ కురిపిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన సభలో ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓ సామాన్య ముస్లిం నేత ఖలీల్ అహ్మద్ కి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు సీఎం జగన్. ఆయనపై టీడీపీ నేత నారాయణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నారాయణను, ఖలీల్ అహ్మద్ చిత్తు చిత్తుగా ఓడించాలని, ముస్లింలంతా ఏకతాటిపైకి వచ్చి ఖలీల్ ని అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని, ముస్లిం రిజర్వేషన్లకు ఆయన వ్యతిరేకం అని, ఎన్డీఏ కూటమిలో చేరినప్పుడే ముస్లింలపై ఆయనకు ఏమాత్రం ప్రేమ ఉందో తేలిపోయిందని అన్నారు జగన్. వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్ట్ కాదని, ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని, వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లను తాము కొనసాగిస్తామని చెప్పారు జగన్. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ అని, ఊసరవెల్లి అని, ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా? అని నిలదీశారు.

మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందని, బాబు మోసాలను ఓడించేందుకు మీరంతా సిద్ధమా అని పిలుపునిచ్చారు సీఎం జగన్. లంచాలు, వివక్ష లేకుండా బటన్‌ నొక్కి డబ్బులు జమ చేస్తున్నామని, జగన్‌ పాలనలో అభివృద్ధి లేదని టీడీపీ, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చామని వివరించారు సీఎం జగన్.

First Published:  4 May 2024 2:04 PM GMT
Next Story