జనంలోకి జగన్.. బస్సుయాత్ర నేడే ప్రారంభం
తొలి రోజు ఇడుపుల పాయనుంచి మొదల్యయే యాత్ర.. కడప పార్లమెంట్ పరిధిలో జరుగుతుంది. వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా యాత్ర కొనసాగుతుంది.
సీఎం జగన్ బస్సుయాత్ర నేటినుంచి ప్రారంభం అవుతుంది. నాన్ స్టాప్ గా 21రోజులపాటు ఈ యాత్ర జరుగుతుంది. ఇడుపులపాయతో మొదలు పెట్టి ఈ యాత్రను ఇచ్చాపురంలో ముగిస్తారు. జగన్ వెంట స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ఇతర కీలక నేతలు ఈ యాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి వస్తున్నారు కాబట్టి ఈ యాత్రకు 'మేమంతా సిద్ధం' అనే పేరు ఖరారు చేశారు.
జనంలోకి సీఎం..
2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు జగన్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నేరుగా జనంలోకి రాలేదు. వివిధ సందర్భాల్లో ప్రజలను కలుస్తున్నా కొద్దిసేపు మాత్రమే. కొంతమందికి మాత్రమే ఆ అవకాశం లభించేది. ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్రజలు, యువత, మహిళలు, రైతులకు ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రతి రోజూ ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు జగన్. అదే సమయంలో స్థానిక నేతలతో విడిగా సమావేశం అవుతారు. ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు అమలు చేసేందుకు దిశా నిర్దేశం చేస్తారు.
తొలి రోజు ఇడుపుల పాయనుంచి మొదల్యయే యాత్ర.. కడప పార్లమెంట్ పరిధిలో జరుగుతుంది. వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా యాత్ర కొనసాగుతుంది. ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద రాత్రి బస చేసే శిబిరానికి చేరుకుంటారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 4 సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్లో కాకుండా మిగతా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను టచ్ చేస్తూ సీఎం జగన్ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర ప్రకటనతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఈరోజు నుంచి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నారు.