"మేమంతా సిద్ధం" ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర
"మేమంతా సిద్ధం" యాత్రలో ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులను సీఎం జగన్ కలుస్తారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు.
ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలోకి దిగడంతో ఏపీలో ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. ఇడుపులపాయ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. వైఎస్సార్ ఘాట్ ప్రాంగణం నుంచి "మేమంతా సిద్ధం" బస్సుయాత్రను ప్రారంభించారు. 21 రోజుల పాటు సాగే ఈ ప్రచార యాత్ర ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో నిర్వహించబోయే తొలి ప్రచార సభలో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
"మేమంతా సిద్ధం" యాత్రలో ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులను సీఎం జగన్ కలుస్తారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. అలాగే 58 నెలల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును సాయంత్రం జరిగే సభల్లో వివరిస్తారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత తను అందించిన సుపరిపాలన గురించి చెప్పేందుకు సిద్ధం సభలు నిర్వహించినా.. జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో అదీ ఎన్నికలకు ముందు ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో ప్రచార శైలి ఎలా ఉండనుంది?.. ప్రజా స్పందన ఏస్థాయిలో ఉండబోతోందో? అనే చర్చ నడుస్తోంది.