Telugu Global
Andhra Pradesh

నాటి పాదయాత్రను తలపించేలా జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఫిక్స్

ప్రతిరోజు ఉదయం వివిధ వర్గాలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ఐదేళ్ల తమ పాలన మంచి చెడులను వారిని అడిగి తెలుసుకుంటారు. సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.

నాటి పాదయాత్రను తలపించేలా జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఫిక్స్
X

2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర తెలుగు రాజకీయాల్లో ఓ బెంచ్ మార్క్. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పాదయాత్ర చేయడం సెక్యూరిటీ సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి జగన్ బస్సుయాత్రను ఎంచుకున్నారు. కానీ షెడ్యూల్ మొత్తం పాదయాత్రలానే ప్లాన్ చేసుకున్నారు. ఈ యాత్రకు సంబంధించి తాజాగా షెడ్యూల్ ప్రకటించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్‌ బస్సు యాత్ర చేపడుతున్నట్టు తెలిపారాయన.


ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర మొదలవుతుంది. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేవరకు అంటే.. ఏప్రిల్ 18వ తేదీ వరకూ ఈ యాత్ర కొనసాగుతుంది. సిద్ధం సభలు జరిగిన 4 నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కలిసి వచ్చేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్లు మొదలయ్యే సమయానికి యాత్ర ముగించి ఎన్నికల సభలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు వైసీపీ నేతలు. పండగలు, సెలవల్లో కూడా బస్సు యాత్ర ఆగబోదని చెప్పారు సజ్జల.

ఈనెల 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం సీఎం జగన్ బస్సుయాత్ర మొదలు పెడతారు. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ ‘మేమంతా సిద్ధం’ పేరుతో తొలి సభ జరుగుతుంది. రోజుకో సభ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం వివిధ వర్గాలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ఐదేళ్ల తమ పాలన మంచి చెడులను వారిని అడిగి తెలుసుకుంటారు. సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం నుంచి పార్టీ నేతలతో సమావేశాలుంటాయి. స్థానిక అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశమవుతారు జగన్. ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటారు. అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేసి వారికి తగిన సూచనలు ఇస్తారు. ఆ తర్వాత సభ జరిగే ప్రాంతానికి బయలుదేరి వెళ్తారు జగన్. ప్రస్తుతానికి తొలి 3రోజుల షెడ్యూల్ ప్రకటించారు. 27వ తేదీ ప్రొద్దుటూరులో, 28న నంద్యాల, 29వతేదీన ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభలకు హాజరవుతారు.

First Published:  19 March 2024 5:25 PM IST
Next Story