Telugu Global
Andhra Pradesh

పత్తికొండలో కోలాహలం.. జగన్ సమక్షంలో చేరికల సంబరం

నాలుగోరోజు బస్సు యాత్ర కర్నూలు జిల్లా నుంచి అనంతపురంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం సీఎం జగన్ అనంతపురం జిల్లా సిద్ధమా అంటూ ట్వీట్ వేశారు.

పత్తికొండలో కోలాహలం.. జగన్ సమక్షంలో చేరికల సంబరం
X

సీఎం జగన్ బస్సు యాత్ర నేడు నాలుగో రోజుకి చేరుకుంది. పత్తికొండ స్టే పాయింట్ నుంచి ఈరోజు ఆయన యాత్ర ప్రారంభించారు. బస్సు ఎక్కే ముందు స్టే పాయింట్ వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం సహా కర్నూలు జిల్లా నేతలు జగన్ ని కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగన్, పార్టీ ప్రచారంపై దృష్టి పెట్టాలని సూచించారు. దాదాపు గంటన్నరసేపు ఆయన నాయకులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు సూచించారు సీఎం జగన్.

చేరికల సంబరం..

మేమంతా సిద్ధం బస్సు యాత్ర కేవలం పార్టీ ప్రచారానికే కాదు, ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి మాట్లాడేందుకు, ముఖ్యంగా చేరికలకు బాగా ఉపయోగపడుతోంది. ప్రతిపక్షాల్లో ఉన్న అసంతృప్తులే కాకుండా, జగన్ పై అభిమానంతో చాలామంది నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు.. పత్తికొండ స్టే పాయింట్ వద్ద జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఉమామహేశ్వర నాయుడు కూడా జగన్ టీమ్ లో చేరారు. బస్సు యాత్రలో గుత్తి వద్ద ఆయన ప్రజల సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.


కర్నూలు నుంచి అనంతపురంలోకి..

నాలుగోరోజు బస్సు యాత్ర కర్నూలు జిల్లా నుంచి అనంతపురంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఉదయం సీఎం జగన్ అనంతపురం జిల్లా సిద్ధమా అంటూ ట్వీట్ వేశారు. ఉదయం పత్తికొండలో కార్యకర్తలతో మీటింగ్ అనంతరం ఆయన బస్సులో తుగ్గలికి వెళ్లారు. అక్కడ స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. తన హయాంలో తుగ్గలి ప్రాంతానికి జరిగిన మేలు వివరించారు. ఆ ప్రాంతంలో ఎంతమందికి ఏయే పథకాలు అందాయి, ఏమేరకు ఆర్థిక లబ్ధి జరిగిందో గణాంకాలతో సహా చెప్పారు జగన్. అనంతరం గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తిలో రోడ్ షో లో సీఎం పాల్గొంటారు. రాత్రికి ధర్మవరం నియోజకవర్గంలో సంజీవపురంలో విడిది ఏర్పాట్లు చేస్తున్నారు.



First Published:  30 March 2024 12:43 PM IST
Next Story