రేపు ఉదయం ఏపీకి జగన్.. తాడేపల్లిలో కీలక సమావేశం
రేపు(శనివారం) ఉదయం 5 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కి వస్తారు.
15రోజుల విదేశీ పర్యటన ముగించుకుని రేపు ఏపీకి రాబోతున్నారు సీఎం జగన్. జగన్ పునరాగమనంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. మళ్లీ మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ జగన్ వేసిన తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. జూన్-9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు పార్టీ సీనియర్ నేతలు ఇదివరకే ప్రకటించారు.
వచ్చీరాగానే మీటింగ్..
రేపు(శనివారం) ఉదయం 5 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కి వస్తారు జగన్. కాసేపు విశ్రాంతి అనంతరం పార్టీ కీలక నేతలతో మీటింగ్ లు మొదలవుతాయి. రేపు ఉదయం 11 గంటలకు కౌటింగ్ పై పార్టీ నేతలతో ఆయన భేటీ అవుతారు. ఫలితాలకు మూడు రోజుల ముందు జరిగే ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.
జగన్ విదేశాల్లో ఉండగా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పిన్నెల్లి వీడియో బయటకు రావడం, ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోవడం, రాష్ట్రంలో కొన్నిచోట్ల కీలక బదిలీలు, పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ న్యాయపోరాటం... ఇలా ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపై ఆయన ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. రేపు నేరుగా పార్టీ కీలక నేతలతో ఆ సమాచారంపై చర్చిస్తారు సీఎం జగన్. కౌంటింగ్ రోజు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునివ్వబోతున్నారు.