ముందు ఆ సీట్లు, తర్వాతే మన సీట్లు.. జగన్ లెక్క పక్కా
కుప్పం, అద్దంకి, టెక్కలి.. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించారు సీఎం జగన్. ఆ మధ్య గన్నవరం విషయంలో కూడా వల్లభనేని వంశీకి లైన్ క్లియర్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న మిగతా స్థానాల్లో కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసి, నియోజకవర్గంలో బలపడటానికి వారికి కావాల్సినంత టైమ్ ఇస్తున్నారు.
2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలవాలనేది జగన్ ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా రెండేళ్ల ముందుగా ఆయన పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందా, లేదా అనే విషయం పక్కనపెడితే ముందు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న స్థానాలపై జగన్ ఫోకస్ పెంచారనేది మాత్రం వాస్తవం. మొన్న కుప్పం, ఆ తర్వాత అద్దంకి, తాజాగా టెక్కలి నియోజకవర్గాల నాయకులతో సమావేశమైన జగన్.. ఆయా స్థానాలకు అప్పటికప్పుడే అభ్యర్థుల్ని ప్రకటించారు. గ్రూపు రాజకీయాలు పెరగకుండా ముందుగానే అడ్డుకట్ట వేశారు.
కుప్పంలో భరత్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతోపాటు, చంద్రబాబుపై ఆయన గెలిచి వస్తే మంత్రి పదవి ఇస్తానని ఆఫరిచ్చారు జగన్. ఆమేరకు ఆయన్ను ఎమ్మెల్యేని, ఆ తర్వాత మంత్రిని చేసుకునే బాధ్యత నియోజకవర్గ కార్యకర్తలదేనని చెప్పారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. అక్కడ కూడా ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనపై 2024లో బాచిన కృష్ణ చైతన్య పోటీకి దిగుతారని ప్రకటించారు జగన్. బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇస్తామని ముందుగానే క్లారిటీ ఇచ్చారు. తాజాగా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ కి లైన్ క్లియర్ చేశారు జగన్.
టెక్కలి విషయంలో వైసీపీలోనే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన పేరాడ తిలక్, ప్రస్తుతం కళింగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా ఇక్కడ సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దశలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ని టెక్కలి అభ్యర్థిగా ప్రకటించడం సంచలనంగా మారింది. సీఎం జగన్ ఇప్పటి వరకూ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో భరత్, శ్రీనివాస్ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ఉండటం విశేషం. ఏరికోరి ఎమ్మెల్సీలనే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పరిచయం చేయడంలో జగన్ వ్యూహం ఏంటనేది తేలాల్సి ఉంది.
కుప్పం, అద్దంకి, టెక్కలి.. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించారు సీఎం జగన్. ఆమధ్య గన్నవరం విషయంలో కూడా వల్లభనేని వంశీకి లైన్ క్లియర్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న మిగతా స్థానాల్లో కూడా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసి, నియోజకవర్గంలో బలపడటానికి వారికి కావాల్సినంత టైమ్ ఇస్తున్నారు. ఇక 151 వైసీపీ సిట్టింగ్ స్థానాల్లో మాత్రం ఈసారి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గడప గడపే గీటురాయి అంటూ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. కొంతమంది జనంలోకి వెళ్లట్లేదని చురకలంటించారు. వారి పనితీరు మెరుగుపరచుకోడానికి మళ్లీ అవకాశమిస్తానని చెప్పారు. సర్వేలో గెలుపు శాతం ఎక్కువ ఉంటనే టికెట్ ఇస్తానని, లేకపోతే మొహమాటాలేవీ తనకు లేవని స్పష్టంగా చెప్పేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలపై జగన్ ఫోకస్ పెట్టారు. ముందు అక్కడ అభ్యర్థుల్ని ఖరారు చేసి, ఆ తర్వాత వైసీపీ గెలిచిన 151 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్నమాట. రెండేళ్ల ముందుగానే జగన్ చేస్తున్న ఈ కసరత్తు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.