Telugu Global
Andhra Pradesh

ఫిషింగ్ హార్బర్ బాధితులకు సీఎం జగన్ భారీ పరిహారం

బోటు వాస్తవ ధర ఎంత, అందులో ఉన్న డీజిల్, చేపల విలువ ఎంత..? పూర్తిగా కాలిపోయిందా, పాక్షికంగా ధ్వంసమైందా..? అనే లెక్కలన్నీ తేల్చి మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం సాయం అందించబోతోంది.

ఫిషింగ్ హార్బర్ బాధితులకు సీఎం జగన్ భారీ పరిహారం
X

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ చరిత్రలోనే అతిపెద్ద అగ్నిప్రమాదంగా నిలిచిపోయిన ఘటన ఇది. దాదాపు 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. ఒక్కో బోటు ఖరీదు 40నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఆ లెక్కన కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు..? కనీసం ఆ బోట్లకు బీమా ఉందా..? పోనీ ప్రభుత్వం అయినా ఆదుకుంటుందా..? మత్స్యకారుల్లో ఉన్న ఆందోళను ఒకే ఒక్క ప్రకటనతో తొలగించారు సీఎం జగన్. బాధితులకు 80 శాతం సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు.

భారీ సాయం..

బోటు వాస్తవ ధర ఎంత, అందులో ఉన్న డీజిల్, చేపల విలువ ఎంత..? పూర్తిగా కాలిపోయిందా, పాక్షికంగా ధ్వంసమైందా..? అనే లెక్కలన్నీ తేల్చి మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం సాయం అందించబోతోంది. 80శాతం సాయం అంటే మాటలు కాదు. పెద్ద మొత్తంలో మత్స్యకారులకోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మత్యకారులను మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాసేపటి క్రితం సీఎం జగన్ నష్టపరిహారంపై కీలక ప్రకటన విడుదల చేశారు.

యూట్యూబర్ నాని పడవలో పార్టీ చేసుకోవడం, దాని వల్ల జరిగిన గొడవ.. ప్రమాదానికి అసలు కారణం అని కొంతమంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నానిని పోలీసులు అరెస్ట్ చేశారు, మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బోట్లలో డీజిల్ ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైరింజన్లు వచ్చినా మంటలు ఆర్పడం సాధ్యం కాలేదు. 40కి పైగా బోట్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

First Published:  20 Nov 2023 1:31 PM GMT
Next Story