గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా
గీతాంజలి ఆత్మహత్య తనను చాలా బాధించిందన్నారు రోజా. గీతాంజలి తన సంతోషాన్ని పంచుకోవడమే తప్పైందన్నారు.
సోషల్‌మీడియాలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల వికృత ట్రోలింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకున్న గీతాలంజలి విషయం తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు జగన్. ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదకు భంగం కలిగించే వారిని చట్టం వదిలిపెట్టదని, గీతాంజలి మృతికి కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టంచేశారు.
ఇక మంత్రి రోజా సైతం గీతాంజలి విషయంపై స్పందించారు. గీతాంజలి ఆత్మహత్య తనను చాలా బాధించిందన్నారు రోజా. గీతాంజలి తన సంతోషాన్ని పంచుకోవడమే తప్పైందన్నారు. తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం సోషల్‌మీడియా గీతాంజలిని ఎంతగా వేధించిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా సోషల్‌మీడియా హద్దుల్లో ఉంటే బాగుంటుందన్నారు.
ఇటీవల వైసీపీ నిర్వహించిన ఓ సభలో పాల్గొన్న గీతాంజలి.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే ఈ ఇంటర్వ్యూపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన సోషల్‌మీడియా కార్యకర్తలు అసభ్యంగా కామెంట్స్ చేయడంతో ఆవేదనకు గురైన గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.