Telugu Global
Andhra Pradesh

ఓటు వేశాక జగన్, చంద్రబాబు ఏం మాట్లాడారంటే..?

చంద్రబాబులో ఫ్రస్టేషన్ కొట్టొచ్చినట్టు కనపడింది. కొన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరగడంలేదని, దాడులకు తెగబడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఓటు వేశాక జగన్, చంద్రబాబు ఏం మాట్లాడారంటే..?
X

ఓటు వేసేముందు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ.. సీఎం జగన్ వేసిన ట్వీట్ నిమిషాల్లో వైరల్ గా మారింది. ఓటు హక్కు ఉన్నవారంతా దాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు జగన్. అనంతరం ఆయన పులివెందులలోని బాకరాపురంలో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. "గత ప్రభుత్వాలను మీరు చూశారు, గతంలో ఏ ప్రభుత్వ హయాంలో మీకు మంచి జరిగిందో తెలుసు, మీ భవిష్యత్తుకోసం మీకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి." అని చెప్పారు సీఎం జగన్.


టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి కూడా అక్కడే ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబులో ఫ్రస్టేషన్ కొట్టొచ్చినట్టు కనపడింది. కొన్నిచోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరగడంలేదని, దాడులకు తెగబడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే తమ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని అన్నారాయన. రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలన్నారు చంద్రబాబు. విదేశాలతోపాటు, ఇతర రాష్ట్రాలనుంచి కూడా తెలుగు వారు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వచ్చారని, ఇక్కడి ఓటర్లు కూడా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు చంద్రబాబు.



ఏపీలో బరిలో ఉన్న అభ్యర్థులంతా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్లో నిలబడి మరీ చాలామంది అభ్యర్థులు ఓటు వేశారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అని, ఓటర్లంతా కచ్చితంగా ఈ బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.

First Published:  13 May 2024 9:04 AM IST
Next Story