అమరావతి - అవినీతి.. అసెంబ్లీలో ఆరోపణలు
ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదని, అదే ధీమాతో చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత, కొట్టేసింది కొండంత అని సెటైర్లు వేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు అమరావతి-అవినీతి అంటూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు అధికార పార్టీ నేతలు. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్ము కొల్లగొట్టారని, తాత్కాలిక నిర్మాణాల పేరుతో భారీగా ముడుపులు స్వీకరించారని డొల్ల కంపెనీలతో ఆ నిధులన్నీ తన అకౌంట్లకే మల్లించుకున్నారని అన్నారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని చెప్పారు.
మొదటిసారిగా షాపూర్ జీ పల్లోంజి కంపెనీ ప్రతినిధి మనోజ్ అనే వ్యక్తిపై ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేశారు సీఎం జగన్. 2019 నవంబర్ లో ఐటీ దాడులు జరగగా.. ఆ తర్వాత వారికి మరింత సమాచారం దొరికిందని, ఆ సమాచారంతో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఐటీ శాఖ దాడులు చేసిందని చెప్పారు. బోగస్ కంపెనీల ద్వారా శ్రీనివాస్ నిధులు మళ్లించారని, ఎల్ అండ్ టి కంపెనీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారన్నారు. దుబాయ్ లో చంద్రబాబుకి షాపూర్ జీ పల్లోంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ రూ. 15.14 కోట్లు ఇచ్చారని అన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు కూడా ఈ స్కామ్ లో భాగస్వామి అని ఆరోపించారు సీఎం జగన్.
నవంబర్, 2019లో షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ పైనా, ఆ తర్వాత చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పైనా ఐటీ దాడులు చేసింది. ఈ దాడుల్లో బోగస్ కంపెనీలతో నిధులు మళ్లించారని గుర్తించారు.
— YSR Congress Party (@YSRCParty) March 24, 2023
- అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ @ysjagan
#APAssembly#TDPScams pic.twitter.com/2pcBrtdbMF
రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి ఒక అవకాశంగా మార్చుకున్నారని, విచ్చలవిడిగా ప్రజాధనం లూటీ చేశారన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదని, అదే ధీమాతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, అప్పట్లోనే పత్రికల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు మంత్రి అమర్నాథ్. రాజధాని ఫండ్స్ పేరిట అమరావతిలో నిర్మాణాలు చేపట్టిన కంపెనీలనుంచి డబ్బులు దండుకున్నారని, డిమాండ్ చేసి మరీ వసూలు చేశారని అన్నారు. బోగస్ ఇన్ వాయిస్ లతో నిధులు మళ్లించారని చివరగా ఆ డబ్బు చంద్రబాబుకు చేరిందన్నారు. చంద్రబాబు, టీడీపీకి వివిధ కంపెనీల ద్వారా రూ.143 కోట్లు అందాయని చెప్పారు.
కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత..
అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత, కొట్టేసింది కొండంత అని సెటైర్లు వేశారు మంత్రి అమర్నాథ్. సచివాలయం, కోర్టు భవనాలు, ఇతర నిర్మాణం కోసం షాపూర్ జీ పల్లోంజీ కంపెనీకి 8వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు ఇచ్చారని, అందులో 2వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని చెప్పారు మంత్రి అమర్నాథ్.