Telugu Global
Andhra Pradesh

మీ బ్యాంక్ స్టేట్ మెంట్లు చెక్ చేసుకోండి..

వంగవీటి రంగాను హత్య చేయించినందుకే కదా చంద్రబాబుని వారంతా వర్గ శత్రువులుగా భావిస్తున్నారని అడిగితే ఆయన మాట్లాడలేరన్నారు. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు అనేవి చంద్రబాబు మార్కు రాజకీయాలని అన్నారు జగన్.

మీ బ్యాంక్ స్టేట్ మెంట్లు చెక్ చేసుకోండి..
X

కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్.. బహిరంగ సభలో చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో పాలన ఎలా ఉంది, తన హయాంలో పాలన ఎలా ఉందనే విషయాన్ని లెక్కలతో సహా వివరించారు. కుప్పం ప్రాంతానికి రావాల్సిన ప్రాజెక్ట్ లను, ప్రతిష్టాత్మక ఆస్పత్రులను కూడా ఆయనే కాలదన్నారని, బాబు తన లాభం చూసుకోవడం వల్లే ఇక్కడి ప్రజలు నష్టపోయారని చెప్పారు. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారని, అందుకే బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారని అన్నారు జగన్. 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసిందని చెప్పారు. హెరిటేజ్‌ లాభాల కోసం మూసివేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించింది మీ జగన్ అని గుర్తు చేశారు.

మీ బ్యాంక్ స్టేట్ మెంట్లు చూడండి..

గతంలో చంద్రబాబు హయాంలో మీ బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి లావాదేవీలు జరిగాయి, వైసీపీ హయాంలో నిధులు ఎలా జమ అయ్యాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు సీఎం జగన్. ఆ ఐదేళ్లు, ఈ ఐదేళ్లు బ్యాంక్ స్టేట్ మెంట్లు చూస్తే ప్రజలెవరూ టీడీపీకి ఓటు వేయరని, చంద్రబాబుకి మద్దతు తెలపరని అన్నారు.

చంద్రబాబు అర్హుడేనా..?

సీఎంగా రాష్ట్రానికి, ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గానికి మేలు చేయలేని చంద్రబాబు తిరిగి ఇక్కడ పోటీ చేసేందుకు అర్హుడేనా అని నిలదీశారు సీఎం జగన్. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ సొంత నియోజకవర్గానికే న్యాయం చేయలేని ఆయనకు సీఎం అయ్యే అర్హత ఉందా అన్నారు. చంద్రబాబుని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు తరిమేస్తే.. కుప్పంకు వచ్చారని, ఇక్కడి బీసీ సీటుని కబ్జా చేసి రాజ్యమేలుతున్నారని అన్నారు. మంచి చేసే వాడికి పొత్తులు అవసరం లేదని, 70 ఏళ్లలో చంద్రబాబు ఏం మంచి చేశారని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం అయినా ఉందా అని ప్రశ్నించారు జగన్.

తలుపులు బిగించుకుని దత్త పుత్రుడితో ప్యాకేజీ వివరాలు మాట్లాడుకుంటారని చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు సీఎం జగన్. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏంటి అంటే సమాధానం చెప్పలేరన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించినందుకే కదా చంద్రబాబుని వారంతా వర్గ శత్రువులుగా భావిస్తున్నారని అడిగితే ఆయన మాట్లాడలేరన్నారు. వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు అనేవి చంద్రబాబు మార్కు రాజకీయాలని అన్నారు జగన్.

First Published:  26 Feb 2024 1:37 PM IST
Next Story