Telugu Global
Andhra Pradesh

ఆ పని చేసిన తొలి ముఖ్యమంత్రిని నేనే..

విద్యతో పేదరికం సంకెళ్లను తెంచుకునే అవకాశం కల్పించేందుకే విద్యారంగంలో గణనీయ మార్పులు తీసుకొచ్చామని చెప్పారు జగన్. ఈరోజు తాను వేసిన ఈ విత్తనం.. రాబోయే 10, 15 ఏళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తుందని వివరించారు.

ఆ పని చేసిన తొలి ముఖ్యమంత్రిని నేనే..
X

రాష్ట్రంలో పిల్లలు ఏం చదువుతున్నారు, వారి సిలబస్ ఏంటి, కరికులమ్ ఏంటి.. అని ఆలోచించి ఉద్యోగ అవకాశాలకు తగ్గట్టు వాటిని మార్చిన ముఖ్యమంత్రి మీ అన్న మాత్రమేనని చెప్పారు సీఎం జగన్. మొట్టమొదటి సారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీని అనుసంధానించింది కూడా మీ అన్న ప్రభుత్వమేనని వివరించారు. కృష్ణా జిల్లా పామర్రులో విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేశారు సీఎం జగన్. 2023 చివరి త్రైమాసికానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను విడుదల చేశారు.


వారితో యుద్ధం తప్పలేదు..

పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందిస్తుంటే, బైజూస్ కంటెంట్ అందిస్తుంటే, ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మారుస్తుంటే.. వైరి వర్గాలకు కంటగింపుగా ఉందని మండిపడ్డారు సీఎం జగన్. వారి పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటారు, పేదల పిల్లలు మాత్రం ఆ చదువుకి అనర్హులు అంటారని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఆ పెత్తందార్లతో యుద్ధం చేయక తప్పలేదని, పేదలకు మంచి చేయడానికే ఈ యుద్ధం అని వివరించారు జగన్.

విద్యతో పేదరికం సంకెళ్లను తెంచుకునే అవకాశం కల్పించేందుకే విద్యారంగంలో గణనీయ మార్పులు తీసుకొచ్చామని చెప్పారు జగన్. ఈరోజు తాను వేసిన ఈ విత్తనం.. రాబోయే 10, 15 ఏళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 10, 15 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు రాణిస్తారని చెప్పారు. జగనన్న విద్యాదీవెనతో ఇప్పటివరకు రూ.12,610 కోట్లు అదించామని చెప్పారు సీఎం జగన్. వసతిదీవెన, విద్యాదీవెన కోసం రూ.18 వేల కోట్లు వెచ్చించామన్నారు. ఎప్పుడూ చూడని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వివరించారు.

14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పేద పిల్లలకు జరిగిన మంచి ఏంటని ప్రశ్నించారు సీఎం జగన్. పేదల బతుకులు మార్చాలని తాను చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతం అయినా చంద్రబాబు చూపించారా అని అడిగారు. ప్రభుత్వ బడులకు చంద్రబాబు చేసిన మంచి ఏంటని అన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన మంచి ఏమీ లేదని, ఆయన చేసిన చెడు మాత్రం చాలా ఉందని అన్నారు. నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించి, ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు సీఎం జగన్. జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే రాష్ట్రం మళ్లీ అస్తవ్యస్తంగా మారుతుందని చెప్పారు.

First Published:  1 March 2024 12:50 PM IST
Next Story