Telugu Global
Andhra Pradesh

కూటమికి ఓటు వేస్తే.. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు జాగ్రత్త

గాజువాకలో కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్‌ అమ్మేయడానికి ప్రజలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని చెప్పారు జగన్.

కూటమికి ఓటు వేస్తే.. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు జాగ్రత్త
X

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని చెప్పారు సీఎం జగన్. తన ఆమోదం లేదు కాబట్టే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందన్నారాయన. గాజువాకలో కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్‌ అమ్మేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని చెప్పారు. ఇక్కడ టీడీపీ, ఎన్‌డీఏ గెలిచిందంటే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపడం సాధ్యం కాదని అన్నారు. వాళ్లు దీన్ని ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారన్నారు. తర్వాత తాను ఎంత ప్రయత్నించినా కేంద్రం ఊరుకోదని, విశాఖ వాసులే స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని తీర్పునిచ్చారని వారు అనే అవకాశం ఉందని వివరించారు జగన్. స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోవాలంటే.. బాబు, దత్త పుత్రుడు, బీజేపీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.


రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికే కూటమి ప్రయత్నిస్తోందని చెప్పారు సీఎం జగన్. ప్రధాని విమర్శలు వింటే తనకు గతంలో ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయని చెప్పారు. వెన్నుపోటు మొనగాడు, అత్యంత అవినీతిపరుడని అన్న నోటితోనే ఇవాళ వారిని పొగుడుతూ మోదీ మాట మార్చారని ఎద్దేవా చేశారు. రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు, పవన్, మోదీ ఎందుకు జట్టు కట్టారని సూటిగా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వారు అంటున్నారా, లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయబోమని హామీ ఇచ్చారా..? అని అడిగారు జగన్.

గతంలో ఎవరూ ఎప్పుడూ బటన్ నొక్కలేదని, మధ్యలో ఎవరూ లేకుండా.. నేరుగా అక్క చెల్లెళ్లకు డబ్బులిచ్చింది తానేనని చెప్పారు సీఎం జగన్. 59 నెలల్లో 2.31 లక్షల ఉద్యోగాలిచ్చామని, 13 జిల్లాలను 26 జిల్లాలు చేశామని, 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని అన్నారు. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయన్నారు. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించి ఉత్తరాంధ్ర వాసుల కష్టాలు తీర్చామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. లంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు అందిస్తున్నామని, సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఇదే కదా అని అన్నారు జగన్.

First Published:  7 May 2024 8:11 PM IST
Next Story