Telugu Global
Andhra Pradesh

జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. తీసుకునే వాడు కాదు

వందేళ్ల క్రితం సర్వేలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు సర్వే చేపట్టామని, ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు సీఎం జగన్.

జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. తీసుకునే వాడు కాదు
X

మే 13న పేదలకు, బాబు మోసాలకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, విలువలకు, విశ్వసనీయతకు.. ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? అని ప్రజల్ని ప్రశ్నించారు సీఎం జగన్. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని వివరించారు. అదే సమయంలో చంద్రబాబు మోసాలను కూడా ప్రజలకు వివరించి చెప్పారు జగన్. ఏ గ్రామంలో చూసినా వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కళ్లకు కడుతుందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు తన జీవితంలో ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదన్నారు జగన్.


తప్పుడు ప్రచారాలు..

ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. అవ్వా తాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ ను ఆపింది చంద్రబాబు అని, తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని అన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి అర్థం తెలుసా అని చంద్రబాబుని ప్రశ్నించారు జగన్. ఎవరి భూములపై వారికి శాశ్వత హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వివరించారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ భూముల్ని జగన్ లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు చెప్పిస్తున్నారని అన్నారు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ.. లాక్కునే వాడు కాదని, ఆ విషయం చంద్రబాబుకి తెలియకపోయినా రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసని అన్నారు జగన్.

వందేళ్ల క్రితం సర్వేలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు సర్వే చేపట్టామని, ఎవరి భూములపై వారికి సర్వ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు సీఎం జగన్. ఇంత మంచి కార్యక్రమానికి వీలైతే మద్దతు తెలపాలి కానీ, తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు జగన్. 2014లో మేనిఫెస్టోతో మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నారని, సూపర్ 7 అంటున్నారని, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కారు ఇస్తానంటున్నారని.. నమ్ముతారా..? అని ప్రశ్నించారు జగన్. ప్రజలు ఆలోచించాలని కోరారు. వాలంటీర్లు మళ్లీ మన ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు, వివక్షత లేని పాలన కావాలన్నా.. ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేయాలన్నారు. 175కి 175 అసెంబ్లీ స్థానాలు 25కి 25 పార్లమెంట్ స్థానాలు తగ్గేందుకు వీలేలేదన్నారు జగన్..

First Published:  1 May 2024 7:13 PM IST
Next Story