సొంత జిల్లాకు జగన్.. 3రోజులు బిజీ బిజీ..
మధ్యాహ్నం 2 గంటలకు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుంటారు జగన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అక్కడ నివాళులు అర్పిస్తారు.
ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన ఏపీ సీఎం జగన్, ఇప్పుడు సొంత జిల్లా కడపకు వస్తున్నారు. ఈరోజు నుంచి 3రోజులపాటు ఆయన అనంతపురం, కడప జిల్లా పర్యటనతో బిజీ బిజీగా ఉంటారు. ఈరోజు ఉదయం అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంతో ఆయన షెడ్యూల్ మొదలవుతుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. ఉదయం అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొంటారు సీఎం జగన్. అనంతరం అక్కడినుంచి కల్యాణదుర్గం వెళ్తారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు.ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ తర్వాత కడప జిల్లాకు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 2 గంటలకు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుంటారు జగన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అక్కడ నివాళులు అర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే ఆయన బస చేస్తారు. రేపు(ఆదివారం) ఉదయం గండికోటకు వెళ్తారు. అక్కడ ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ ను పరిశీలిస్తారు. ఈ తర్వాత పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తారు. అనంతరం ఇడుపులపాయ చేరుకుంటారు.
సోమవారం కొప్పర్తిలో
ఈనెల 10వ తేదీ సోమవారం ఉదయం 9గంటలకు ఇడుపులపాయ నుంచి కడపకు వెళ్లి అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు సీఎం జగన్. ఆ తర్వాత కడప నుంచి కొప్పర్తి వెళ్లి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. అదేరోజు మధ్యాహ్నానికి ఆయన తాడేపల్లి చేరుకుంటారు.