Telugu Global
Andhra Pradesh

మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి సీఎం ఫస్ట్ వార్నింగ్

మంత్రితో నేరుగా ఫోన్ లో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఇలాంటి వ్యవహారాలు సహించేది లేదన్నారు. అధికారులతో మర్యాదగా మసలుకోవాలన్నారు.

మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి సీఎం ఫస్ట్ వార్నింగ్
X

అధికారులపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తరచూ చూస్తూనే ఉంటాం. కానీ అధికారులపై నేతల కుటుంబ సభ్యుల పెత్తనం కాస్త అరుదు. అలాంటి ఘటన కూటమి ప్రభుత్వంలో తొలిసారిగా జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి, స్థానిక ఎస్సైతో దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు. సదరు మంత్రితో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. ఇలాంటి వ్యవహారాలు సహించేది లేదన్నారు. అధికారులతో మర్యాదగా మసలుకోవాలన్నారు. ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, సీఎం చంద్రబాబుకి హామీ ఇచ్చారు.

అసలేం జరిగింది..?

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. సీఎం చంద్రబాబు కూడా ఉదయం 6 గంటలకే తొలి పెన్షన్ పంపిణీ చేశారు. ఆయనతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర స్థానిక నేతలు కూడా తమ తమ ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆమె కాన్వాయ్ కి సెక్యూరిటీగా రావాల్సిన ఎస్సై కాస్త ఆలస్యంగా రావడంతో అసలు కథ మొదలైంది. ఆలస్యంగా వచ్చిన ఎస్సైని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడే తెల్లారిందా, పెళ్లికి వచ్చానని అనుకుంటున్నావా..? అంటూ తోటి సిబ్బంది ముందే ఆయన్ను అవమానించారు. నీకు ప్రభుత్వం జీతమిస్తుందా, లేక వైసీపీ వాళ్లేమైనా ఇస్తున్నారా అంటూ అసందర్భంగా కూడా మాట్లాడారామె. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, వైసీపీ వాళ్లు కూడా కూటమి పాలన ఇలాగే ఉంటుందంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు.


గతంలో కూడా మంత్రులు పోలీసులపై రుసరుసలాడిన సందర్భాలున్నాయి. కానీ మంత్రి భార్య ఇలా ఎస్సైని నడిరోడ్డులో నిలబెట్టి, తోటి సిబ్బంది ముందు అవమానకరంగా మాట్లాడటం మాత్రం ఇటీవల కాలంలో ఇదే తొలి ఘటన అని చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడం వల్లే సీఎం జోక్యం చేసుకున్నారు. కెమెరాల్లో రికార్డ్ కాని ఇలాంటి ఎన్నో వార్నింగ్ లను పోలీసులు కూడా మౌనంగానే భరిస్తుండటం విచారకరం.

First Published:  2 July 2024 1:41 AM GMT
Next Story