కుప్పంకు సీఎం.. రెండు రోజుల బిజీ షెడ్యూల్
ప్రస్తుతం 9వసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు చంద్రబాబు. ఈసారి సొంత నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంకు వెళ్తున్నారు. రెండు రోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు, అన్న క్యాంటీన్ ప్రారంభించడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు.
వైసీపీ అధికారంలో ఉండగా.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వినిపించేవి. అప్పటికి మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా, 8 సార్లు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదనే ఆరోపణలు వినపడేవి. కుప్పంలో కూడా చంద్రబాబుని ఓడిస్తామని సవాళ్లు విసిరారు వైసీపీ నేతలు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈసారి సీఎం అయిన చంద్రబాబు కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కుప్పం అభివృద్ధికి ఆయన ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సొంత నియోజకవర్గం పర్యటనకు వస్తున్నారు.
చంద్రబాబు పర్యటన ఇలా..
ఈనెల 25, 26 తేదీల్లో సీఎం పర్యటన
25వతేదీ మధ్యాహ్నం 12:30 కు కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీకు చేరిక
మధ్యాహ్నం 1 గంటకు అన్న క్యాంటీన్ ప్రారంభం
1:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ
3:30 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో సమీక్ష
సాయంత్రం 6 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం
అనంతరం అక్కడే రాత్రి బస
26వతేదీ ఉదయం 10 గంటలకు జిల్లా నేతలతో సమీక్ష
ఉదయం 11 గంటలకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ
మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండలంలోని గుండిశెట్టిపల్లి వద్ద కాలువ పరిశీలన
మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పీఈఎస్ కాలేజీ ఆడిటోరియంలో నియోజకవర్గ నాయకులతో సమావేశం
సాయంత్రం 4:30 గంటలకు తిరుగు ప్రయాణం
ప్రస్తుతం 9వసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు చంద్రబాబు. ఈసారి కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అటు పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టం చేయాలనుకుంటున్నారు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్ను ఆకట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు.