Telugu Global
Andhra Pradesh

ముహూర్తం ఖరారైనట్టే.. విశాఖకు సీఎం కార్యాలయం తరలింపు ఆరోజే

అధికారిక ప్రకటన కాదు కానీ, సీఎంఓ వర్గాల సమాచారం మేరకు అన్నిటికంటే ముందు సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలిస్తారు.

ముహూర్తం ఖరారైనట్టే.. విశాఖకు సీఎం కార్యాలయం తరలింపు ఆరోజే
X

విశాఖకు రాజధాని తరలింపు విషయంలో ఇటీవల సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. దసరాకు ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. గతంలో కూడా ఇలాంటి డెడ్ లైన్లు పెట్టినా.. ఈసారి మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఇదే ఫైనల్ అనే చర్చ జరుగుతోంది. సీఎం జగన్ ప్రకటన తర్వాత విశాఖలో హడావిడి కూడా మొదలైంది. పార్టీ కార్యాలయం తరలింపుకి ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఏపీ సీఎస్, ఇతర ఉన్నతాధికారులు విశాఖలోనే మకాం వేసి ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల వసతి వంటి విషయాలపై చర్చిస్తున్నారు. దీంతో ఈసారి తరలింపు ఖాయం అని తేలిపోయింది. అయితే ముహూర్తంపై మాత్రం అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

అక్టోబర్-23

అధికారిక ప్రకటన కాదు కానీ, సీఎంఓ వర్గాల సమాచారం మేరకు అన్నిటికంటే ముందు సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలిస్తారు. క్యాంపు కార్యాలయం తరలింపుకి ముహూర్తం అక్టోబర్-23 గా ఫిక్స్ చేశారని సమాచారం. ఆరోజు విశాఖలో సీఎం కార్యాలయంలో పూజ చేస్తారని, లాంఛనంగా కార్యాలయం ప్రారంభిస్తారని అంటున్నారు. ఆ తర్వాత మిగతా వ్యవహారాలన్నీ రోజుల వ్యవధిలోనే పూర్తవుతాయని తెలుస్తోంది.

రుషికొండ నిర్మాణాల విషయంలో ఇంకా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోతోంది. వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకుంటారో లేదో స్పష్టంగా చెప్పడంలేదు. పోనీ సచివాలయానికి సరిపోయే బిల్డింగ్ ఏదయినా ఉందా అంటే దానిపై కూడా క్లారిటీ లేదు. అయితే ఆ దిశగా ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. కార్యాలయాల తరలింపుపై అధికారులు ఓ నిర్ణయానికి వస్తే అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన విడుదలవుతుంది. ముహూర్తం ఖరారయితే ఇక పనుల్లో ఆలస్యం ఉండదని అంటున్నారు. అటు ఉద్యోగ వర్గాల్లో కూడా పాలనా రాజధాని తరలింపుపై ఉత్కంఠ నెలకొంది.

First Published:  30 Sept 2023 7:32 AM IST
Next Story