బూతులు తిట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి
సామినేని ఉదయభానును ఉద్దేశించి పరుష పదజాలంతో వెల్లంపల్లి శ్రీనివాస్ దూషించారు. ''నువ్వు ఎవరు? పెద్ద పోటుగాడివా? నా నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు?'' అంటూ గట్టిగా అరిచారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు భవకుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగింది.
భవకుమార్ కు శుభాకాంక్షలు తెలిపి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తిరిగి వెళుతున్న సమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎదురుపడ్డారు. ఆ సమయంలోనే ఎదురుపడిన సామినేని ఉదయభానును ఉద్దేశించి పరుష పదజాలంతో వెల్లంపల్లి శ్రీనివాస్ దూషించారు. ''నువ్వు ఎవరు? పెద్ద పోటుగాడివా? నా నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు?'' అంటూ గట్టిగా అరిచారు. అందుకు సామినేని ఉదయభాను కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందించారు.'' పార్టీలో నేను సీనియర్ నాయకుడిని. నీలా పదవుల కోసం పార్టీలు మారలేదు. మూడు పార్టీలు మారిన ఊసరవెల్లి నువ్వు!. నీవేంటి నాకు చెప్పేది? .ఇలాంటి బెదిరింపులు మరెవరిదగ్గరైనా చూపించు. నా దగ్గర కాదు. నోరు అదుపులో పెట్టుకో'' అంటూ అంటూ మాజీ మంత్రికి సామినేని ఉదయభాను వార్నింగ్ ఇచ్చారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఆకుల శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల కాలంలో ఆకుల శ్రీనివాస్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే ఉదయభాను కలిసిన ఆకుల శ్రీనివాసరావు.. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించాలనుకుంటున్నానని, అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన సామినేని ఉదయభాను తనతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు శ్రీనివాస్ ను తీసుకెళ్లి వివాహ ఆహ్వాన పత్రం అందజేయించారు.
తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడిని తనకు చెప్పకుండా సీఎం దగ్గరకు సామినేని ఉదయభాను తీసుకెళ్లడంపై వెల్లంపల్లి ఆగ్రహించారు. సామినేని ఉదయభానును పరుష పదజాలంతో మాజీ మంత్రి మాట్లాడారు.. అందుకు సామినేని ఉదయభాను కూడా అంతేస్థాయిలో స్పందించారు. ఒక దశలో ఒకరి మీదకి ఒకరు వెళ్తుండగా అక్కడున్న కార్యకర్తలు, నాయకులు సర్దిచెప్పి ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరు ఇలా బూతులు తిట్టుకొని గొడవపడిన వ్యవహారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా చేరినట్లు చెబుతున్నారు.