ఏపీలో పొలిటికల్ ఫైట్: అక్కడ జెండాలు, ఇక్కడ జెండా దిమ్మెలు..
విజయవాడలో జెండా దిమ్మె దగ్గర వైసీపీతో గొడవపడ్డారు. బెజవాడ సెంటర్లలో తమ జెండా దిమ్మెలను వైసీపీ నేతలు పడగొడుతున్నారని, కొన్నిచోట్ల కబ్జా చేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ.
ఏపీలో పొలిటికల్ ఫైట్ జరుగుతోంది, మొన్న కుప్పంలో టీడీపీ-వైసీపీ మధ్య ఫైట్ జరిగింది, నిన్న విజయవాడలో వైసీపీ-జనసేన మధ్య కుమ్ములాట జరిగింది. కొట్టుకున్నారు, చొక్కాలు చించుకున్నారు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు, చివరకు అరెస్ట్ అయ్యారు. ఇంత సీన్ జరిగినా ఈ పొలిటికల్ ఫైట్ కి కారణాలు వెదికితే వింతగానే ఉంటాయి. మొన్న కుప్పంలో జెండాలకోసం గొడవ జరిగింది, నిన్న బెజవాడలో జెండా దిమ్మెలకోసం ఫైట్ జరిగింది.
కుప్పంలో ఏదో ఒక కారణంతో గొడవ జరగాలి అన్నట్టుగా ఇరు వర్గాలు రెచ్చిపోయాయని తెలుస్తోంది. చంద్రబాబు ర్యాలీలో వైసీపీ జెండాలు కనపడటం, అసలు మా జాగీర్లో మీ జెండాలేంటని టీడీపీ రెచ్చిపోవడం, చివరకు కుమ్ములాట జరిగింది. ఈ గొడవ చూసి జనసేన కాస్త నొచ్చుకున్నట్టయింది. మీరూ మీరూ కొట్టుకుంటే మా సంగతేంటని జనసైనికులు మధనపడ్డారు. విజయవాడలో జెండా దిమ్మె దగ్గర వైసీపీతో గొడవపడ్డారు. బెజవాడ సెంటర్లలో తమ జెండా దిమ్మెలను వైసీపీ నేతలు పడగొడుతున్నారని, కొన్నిచోట్ల కబ్జా చేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. పవన్ పుట్టినరోజు సందర్భంగా తమ జెండా దిమ్మెకు తాము రంగులు వేసుకుంటే వైసీపీ నేతలకు నొప్పెందుకని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నాయకుడొకరు అరెస్ట్ కావడం, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ బయటకు రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
దౌర్జన్యాలను ఎదుర్కొంటాం..
వైసీపీ దౌర్జన్యాలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని అన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి పక్షాన పోరాడుతోందని, అది చూసి ఓర్వలేక అధికార వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. జనసేన జెండాలను చూసి భయపడి అక్కసుతో దాడి చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల జగ్గయ్యపేటలో, ఇప్పుడు విజయవాడలో జనసేన జెండా చూసి వైసీపీ నేతలు ఉలిక్కి పడ్డారని అన్నారు. వ్యవహారం అరెస్ట్ ల వరకు వెళ్లడంతో.. తమవారిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు జనసేన నిరసనకు దిగింది.
ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఏపీలో పొలిటికల్ ఫైట్ మొదలైంది. మాటల యుద్ధం కాస్తా చేతల యుద్ధం వరకు వెళ్లింది. ఈ గొడవలకు జెండాల ప్రదర్శన అనేది కామన్ పాయింట్. మా జెండా ఎగరాలంటే, కాదు మా జెండా ఎగరాలంటూ నేతలు, కార్యకర్తలు గొడవలకు దిగుతున్నారు. ఇక ఎన్నికలు దగ్గరపడితే ఈ గొడవలు, ఆధిపత్యపోరు ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.