ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. - టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ
వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదను దెబ్బతీస్తున్నారని, సభాధ్యక్షుడికి కనీస గౌరవం ఇవ్వకుండా ఆయనపైనే కాగితాలు చింపి విసరడం సరికాదని మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీలో సోమవారం నాడు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. ఏడోరోజు అసెంబ్లీ ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు జీవో నంబర్-1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టిన టీడీపీ సభ్యులు స్పీకర్ వద్దకు కూడా వెళ్లి.. కాగితాలు చింపి ఆయనపై చల్లారు.
దీనిపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదను దెబ్బతీస్తున్నారని, సభాధ్యక్షుడికి కనీస గౌరవం ఇవ్వకుండా ఆయనపైనే కాగితాలు చింపి విసరడం సరికాదని మండిపడ్డారు. బీఏసీ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరిక మేరకే.. వారు కోరిన అన్ని అంశాలపైనా చర్చకు అవకాశం కల్పించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా సూచించారని వివరించారు. శని, ఆదివారాల్లోనూ సభ నిర్వహించాలని టీడీపీ సభ్యులు కోరిక మేరకే నిర్వహించామని కూడా తెలిపారు. డిమాండ్ చేసిన వారే సభలో అంశాలపై చర్చ జరగకుండా అడ్డుకోవడం తగదని హితవు పలికారు.
జీవో నంబర్-1 తీసుకురావడానికి కారణం టీడీపీ సభ్యులకు తెలియదా అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. నెల్లూరు, గుంటూరులో ఇరుకు సందుల్లో సభలు నిర్వహించి ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైనందు వల్లే.. ఇలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ జీవో తీసుకొచ్చిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఈ జీవో తమ పార్టీకి కూడా వర్తిస్తుందని వారు పదేపదే వివరించారు. అయినా టీడీపీ సభ్యులు వినకుండా ఆందోళన కొనసాగించారు.
ఒక దశలో స్పీకర్ ముఖానికి అడ్డుగా ప్లకార్డు పెట్టి మరీ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ ప్లకార్డును తొలగించడం కోసం వైసీపీ ఎమ్మెల్యే వెళ్లగా తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సభను స్పీకర్ వాయిదా వేస్తూ నిర్ణయించారు.
సభ వాయిదా అనంతరం వైసీపీ సభ్యుడు సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా స్పీకర్ ముఖానికి అడ్డుగా పెట్టిన ప్లకార్డును తొలగించే ప్రయత్నం చేయగా, ఆయన్ని తోసివేశారని చెప్పారు. దీంతో పడిపోబోయిన ఎలీజాను తాను పట్టుకునేందుకు వెళ్లానని, ఆ సమయంలో తనపై టీడీపీ సభ్యుడు అశోక్ దాడి చేశారని వివరించారు. దళిత ఎమ్మెల్యేనైన తనపై దాడి చేయడం దారుణమని ఆయన విమర్శించారు.
మరోపక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే తమపై దాడి చేశారని ఆయన విమర్శించారు. తిరిగి సభ ప్రారంభించిన అనంతరం టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు.