Telugu Global
Andhra Pradesh

నాదెండ్ల సీనేంటో తేలిపోతుందా?

పార్టీపరంగా చూసినా కూడా తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ఓట్లే ఎక్కువ. అలాంటిది పొత్తు కోసమని గెలుస్తామని అనుకుంటున్న తెనాలిని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. ఇక్కడే నాదెండ్ల సీన్ ఏమిటో తేలిపోతుంది.

నాదెండ్ల సీనేంటో తేలిపోతుందా?
X

కొద్ది రోజుల్లోనే నాదెండ్ల మనోహర్ సీనేంటో తేలిపోతుంది. రాబోయే ఎన్నికల్లో తెనాలి నుండి పోటీ చేయటానికి నాదెండ్ల రెడీ అవుతున్నారు. జనసేన పార్టీలో అధినేత పవన్ కల్యాణ్ తర్వాత స్థానం నాదెండ్లదే అన్న విషయం అందరికీ తెలిసిందే. పేరుకు మాత్రమే పవన్ పార్టీ చీఫ్. కానీ అన్నీ వ్యవహారాలను నడిపిస్తున్నది నాదెండ్ల మాత్రమే. అలాంటిది తెనాలిలో నాదెండ్ల పోటీ చేస్తారా లేదా అన్న విషయంలో సందిగ్దం పెరిగిపోతోంది.

నిజానికి జనసేనలో నెంబర్ టూ స్థానంలో ఉన్న కారణంగా నాదెండ్ల కోరుకున్న తెనాలి సీటులో పోటీకి ఎదురుండకూడదు. కానీ ఇక్కడ సీన్ వేరేలా ఉంది. విషయం ఏమిటంటే టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమనే అనుకుంటున్నారు. పొత్తుతో సంబంధం లేకుండానే తెనాలిలో పోటీ చేయటానికి టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా సిద్ధమవుతున్నారు. అలాంటపుడు జనసేనతో పొత్తుంటే సీటులో గెలుపు ఖాయమని ఆలపాటి అంచనాలు వేసుకుంటున్నారు.

అంటే తెనాలి అసెంబ్లీ సీటు కోసం ఇటు నాదెండ్ల అటు ఆలపాటి ఇద్దరూ పోటీపడుతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను చూస్తే జనసేన తరపున పోటీ చేసిన నాదెండ్లకు వచ్చిన ఓట్లు సుమారు 30 వేలు. అలాగే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటికి వచ్చింది 76 వేల ఓట్లు. మొదటి నుండి ఈ సీటు టీడీపీకి బాగా పట్టున్నదనే చెప్పాలి. అలాంటిది రాబోయే ఎన్నికల్లో పవన్ కోసమని తెనాలి సీటును చంద్రబాబు నాయుడు వదులుకునేది అనుమానమే. వ్యక్తిగతంగా చూస్తే నాదెండ్ల కన్నా ఆలపాటికే నియోజకవర్గంలో ఎక్కువ పట్టుంది.

పార్టీపరంగా చూసినా కూడా టీడీపీ ఓట్లే ఎక్కువ. అలాంటిది పొత్తు కోసమని గెలుస్తామని అనుకుంటున్న తెనాలిని ఆలపాటి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. ఇక్కడే నాదెండ్ల సీన్ ఏమిటో తేలిపోతుంది. తెనాలి సీటు కోసం పవన్ పట్టుబడతారా? లేదా అన్నది చర్చలు మొదలైన‌ప్పుడు తేలిపోతుంది. గెలిచే సీట్లను మాత్రమే అడుగుతామని పవన్ ఇదివరకే ప్రకటించారు. మరి పార్టీ గెలిచే సీట్లలో తెనాలి ఉందా? ఈ విషయాన్ని పవనే చెప్పాలి. మొత్తానికి తెనాలి సీటు పవన్‌కు పెద్ద సమస్యగానే మారేట్లుంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

First Published:  5 Jun 2023 10:45 AM IST
Next Story