పోక్సో కేసులో మాజీ సీఎంకు సీఐడీ నోటీసులు
ఆ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. యడియూరప్పపై ఆరోపణలు చేసిన మహిళ.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. అయితే.. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ ఇదివరకే రికార్డు చేసింది.
పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందు యడియూరప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు (17 ఏళ్ల బాలిక), ఆమె తల్లి ఫిబ్రవరి 2న బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను ఆయన బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. యడియూరప్పపై ఆరోపణలు చేసిన మహిళ.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. అయితే.. బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సీఐడీ ఇదివరకే రికార్డు చేసింది.
కర్ణాటకకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప ఆ పదవి వీడిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతేడాది నవంబరులో ఆ బాధ్యతలను పార్టీ అధిష్టానం ఆయన కుమారుడు విజయేంద్రకు అప్పగించింది. ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన అప్పట్లోనే ఖండించారు. ప్రస్తుతం నోటీసులు అందిన నేపథ్యంలో.. ఢిల్లీలో ఉన్న ఆయన.. అక్కడినుంచి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.