Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఆఫీస్ కి సీఐడీ బృందం.. ఎందుకంటే..?

టీడీపీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో ఇటీవల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై వరుస కథనాలొచ్చాయి. బుగ్గన చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

టీడీపీ ఆఫీస్ కి సీఐడీ బృందం.. ఎందుకంటే..?
X

ప్రస్తుతం ఏపీలో మార్గదర్శి కేసు వ్యవహారంలో సీఐడీ పేరు ప్రముఖంగా వినపడుతోంది. తాజాగా ఏపీ సీఐడీ అధికారులు మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ కి వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరుతో సిద్ధం చేసిన నోటీసులను అక్కడున్న లాయర్ కి అందించారు. ఆ నోటీసుల ప్రకారం చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు. ఆ నోటీసుల్లో ఏముందనే విషయం ఇంకా బయటకు రాలేదు. అయితే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకే సీఐడీ అధికారులు టీడీపీ ఆఫీస్ కి వెళ్లినట్టు తెలుస్తోంది.

బుగ్గన ఫిర్యాదు..

టీడీపీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో ఇటీవల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై వరుస కథనాలొచ్చాయి. ఆయన ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో స్థిర, చర ఆస్తుల వివరాలను చైతన్య రథంలో ప్రచురించారు. అయితే ఆస్తుల విషయం చెబుతూ తప్పుడు వార్తలు రాశారనేది బుగ్గన ఫిర్యాదు. చైతన్య రథంపై బుగ్గన చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు నిమిత్తం ఈరోజు టీడీపీ ఆఫీస్ కి వెళ్లారు.

ఎడిటర్ ఎవరు..?

టీడీపీ ఆధ్వర్యంలో వస్తున్న చైతన్య రథం పత్రికకు ఎడిటర్, దాని నిర్వహణ ఎవరని సీఐడీ అధికారులు టీడీపీ ఆఫీస్ సిబ్బందిని ప్రశ్నించారు. సీఐడీ అధికారులు వచ్చారన్న సమాచారంతో వెంటనే టీడీపీకి సంబంధించిన కొంతమంది లాయర్లు అక్కడికి చేరుకున్నారు. సీఐడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. చైతన్య రథం పత్రిక విషయంలో వారు అక్కడ ఉన్నవారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

First Published:  11 April 2023 10:38 AM GMT
Next Story