Telugu Global
Andhra Pradesh

నారాయణకు ఎదురుదెబ్బ.. ఫ్యామిలీ మొత్తానికి సీఐడీ నోటీసులు

మార్చి 6న నారాయణ విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని చెప్పింది.

నారాయణకు ఎదురుదెబ్బ.. ఫ్యామిలీ మొత్తానికి సీఐడీ నోటీసులు
X

అమరావతి భూముల గోల్ మాల్ వ్యవహారంలో ఏపీ సీఐడీ మళ్లీ స్పీడ్ పెంచింది. మాజీ మంత్రి నారాయణ, ఆయన ఇద్దరు కుమార్తెలు సింధూర, శరణి, ఇద్దరు అల్లుళ్లు పునీత్ వరుణ్ సహా.. ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ ఎండీ అంజనీకుమార్‌ కి సీఐడీ నోటీసులిచ్చింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ ఈ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న నారాయణ విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని చెప్పింది.

అసైన్డ్ భూముల వ్యవహారంలో..

అమరావతిలో ప్రభుత్వం సేకరించాల్సిన భూమి అప్పటికే కొంతమంది పేదల పేరిట ఉంది. దాదాపు 1400 ఎకరాలను ఆ పేదలనుంచి కొంతమంది పెద్దలు అక్రమంగా తీసేసుకున్నారు. అందులో 169.27 ఎకరాలు మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో తీసేసుకున్నారని అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే వైసీపీ లెక్కలు చదివి వినిపించింది. ఆ తర్వాత కేసు సీఐడీ విచారణకు వెళ్లింది. ఆ విచారణలో భాగంగా గతంలో ఎన్ స్పైర అనే కంపెనీపై దాడి జరిగింది. నారాయణకు సంబంధించిన ఎన్ స్పైరలో కొన్ని కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను సీఐడీ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు విచారణకు పిలిచారు అధికారులు.

అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలు చేసి, ఒప్పందాలు చేసుకున్న తర్వాత, సేల్ డీడ్ లు కూడా రెడీ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం అసైన్డ్ భూములకు కూడా పరిహారం చెల్లించడంతో వారి పంట పండింది. పరిహారంతోపాటు.. అభివృద్ధి జరిగిన తర్వాత స్థలాల్లో వాటా కూడా వారికే దక్కుతుంది. ఇలా పేదల దగ్గర చౌక ధరకు కొట్టేసిన భూములతో పెద్దలు.. ప్రభుత్వంతో లాభసాటి వ్యాపారం మొదలు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ చేపట్టింది. అప్పట్లో క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) నారాయణ గుప్పెట్లో ఉండటం వల్లే ఈ అక్రమాల్లో ఆయన పాత్ర ఎక్కువగా ఉందని, నారావారి ఆస్తులకు నారాయణ కూడా బినామీగా మారారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. వీటిలో ఏది నిజమో, ఎంత నిజమో సీఐడీ విచారణలో తేలాల్సి ఉంది.

First Published:  28 Feb 2023 8:11 PM IST
Next Story