సీఐడీ పిలుపు: లోకేష్ తో పాటు నారాయణ కూడా..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ఏ-1గా ఉన్నారు. మాజీ మంత్రి నారాయణ ఏ-2. ఇదే కేసులో నారా లోకేష్ ని ఏ-14గా ఇటీవల సీఐడీ చేర్చింది. ఈనెల 4న లోకేష్, నారాయణ ఇద్దర్నీ సీఐడీ విచారణకు పిలవడం గమనార్హం.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో ఏపీ సీఐడీ స్పీడ్ పెంచినట్టు స్పష్టమవుతోంది. మాజీ మంత్రి నారాయణకు తాజాగా సీఐడీ నోటీసులిచ్చింది. ఈ నెల 4న సీఐడీ కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. నారాయణ ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు విచారణకు రావాలంటూ సీఐడీ 41-ఎ నోటీసులివ్వడం గమనార్హం.
లోకేష్, నాారాయణ ఇద్దరూ..
ఈ నెల 4న నారా లోకేష్ విచారణకు ముహూర్తం ఫిక్స్ చేసిన సీఐడీ.. ఢిల్లీ వెళ్లి మరీ ఆయనకు నోటీసులిచ్చింది. ఈ నోటీసులు తీసుకున్న లోకేష్, విచారణకు తాను భయపడేది లేదని, పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇన్నాళ్లూ ఢిల్లీలోనే మకాం పెట్టిన లోకేష్.. సీఐడీ విచారణ కోసం ఎట్టకేలకు ఏపీకి రావాల్సి వస్తోంది. ఈ రోజు చంద్రబాబు జైలులో, భువనేశ్వరి రాజమండ్రిలో నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షలకు మద్దతుగా లోకేష్ ఢిల్లీలో నిరసన చేపడతారని టీడీపీ చెబుతోంది. ఈ దీక్ష పూర్తయిన తర్వాత లోకేష్ ఏపీకి వచ్చే అవకాశముంది.
ఏ-1, ఏ-2, ఏ-14
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ఏ-1గా ఉన్నారు. మాజీ మంత్రి నారాయణ ఏ-2. ఇదే కేసులో నారా లోకేష్ ని ఇటీవల సీఐడీ ఏ-14గా చేర్చింది. లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్ కు చెందిన అంజనీ కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తోపాటు పలువురిని ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీఐడీ. చంద్రబాబుకి ఈ కేసులో ముందస్తు బెయిల్ రాలేదు, లోకేష్ బెయిల్ పిటిషన్ ని హైకోర్టు పక్కనపెట్టింది, నారాయణకు బెయిల్ వచ్చినా విచారణకు హాజరు కావాల్సిందే. ఈనెల 4న లోకేష్, నారాయణ ఇద్దర్నీ సీఐడీ విచారణకు పిలవడం గమనార్హం.
♦