ఈసారన్నా హాజరవుతారా? తీవ్ర చర్యలు తప్పవా?
సీఐడీ కార్యాలయానికి రమ్మంటే రావటంలేదు, పోనీలే కదాని ఇంటికి వెళ్ళి విచారిస్తే సహకరించటంలేదు. ఈసారి గనుక విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది.
మార్గదర్శి అక్రమాలు, అవినీతిపై విచారణకు రావాలని ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రామోజీని 16వ తేదీన హాజరవ్వాలని సీఐడీ చెప్పింది. అలాగే 17వ తేదీన విచారణకు హాజరవ్వాలని శైలజకు నోటీసులో స్పష్టంగా పేర్కొంది. గతంలో కూడా గుంటూరు ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులిచ్చినా రామోజీ, శైలజ పట్టించుకోలేదు. సీఐడీ కార్యాలయానికి రమ్మంటే రావటంలేదు, పోనీలే కదాని ఇంటికి వెళ్ళి విచారిస్తే సహకరించటంలేదు. ఈసారి గనుక విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది.
వీళ్ళిద్దరికీ 41(ఏ)కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కుంభకోణంలో రామోజీ ఏ1, శైలజ ఏ2గా సీఐడీ కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. మొత్తంమీద రామోజీ, శైలజ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. మార్గదర్శి వ్యాపారమంతా అవినీతి, అక్రమాలతోనే జరుగుతోందని సీఐడీ ఉన్నతాధికారులు ఇప్పటికే చాలాసార్లు మీడియా సమావేశంలో చెప్పారు. మార్గదర్శి వ్యాపారం ఏ విధంగా అక్రమమో కూడా చెప్పారు. అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారాన్ని ఏ చట్టం ప్రకారం నిర్వహిస్తున్నారో చెప్పమంటే రామోజీ చెప్పటంలేదు.
ఎంతసేపు 60 ఏళ్ళుగా మార్గదర్శిపై ఎక్కడా ఫిర్యాదులు లేవని, విశ్వసనీయతకు మార్గదర్శి మారుపేరని మాత్రమే రామోజీ చెబుతున్నారు. చిట్ ఫండ్ నిధులను చిట్టేతర వ్యాపారాలకు తరలించకూడదన్న ప్రాథమిక నిబంధనను కూడా రామోజీ, శైలజ పాటించలేదు. సుమారు 60 కంపెనీలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ లో చిట్ ఫండ్స్ డబ్బులను తరలించినట్లు రుజువైంది.
మార్గదర్శి చందాదారుల వివరాలను ప్రకటించమని కోర్టు ఆదేశించినా రామోజీ ప్రకటించటంలేదు. మార్గదర్శిలో కోటి రూపాయలు డిపాజిట్ చేసినవాళ్ళ సంఖ్య సుమారుగా 800 అని తేలింది. అందుబాటులోని రికార్డుల ప్రకారం మాత్రమే 800 మంది పేర్లు బయడపడింది. ఇంకా ఎంతమంది కోటి రూపాయల పైన డిపాజిట్లు చేశారో చెప్పమంటే చెప్పటంలేదు. ఇంట్లోనే వీళ్ళని విచారించాలని అనుకుంటే విచారణ అధికారులను సిబ్బంది రోడ్డు మీదే నిలబెట్టేశారు. ఎంతో గొడవపడిన తర్వాత కానీ అధికారులను ఇంట్లోకి అనుమతించలేదు. ఏదో రకంగా విచారణను తప్పించుకునేందుకే మామ, కోడళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరి విజయవాడలో జరిగే విచారణకైనా హాజరవుతారా?